Homeబిజినెస్​NSDL IPO | త్వరలో ఐపీవోకు ఎన్‌ఎస్‌డీఎల్.. ఏకంగా 40శాతం పెరిగిన షేరు ధర

NSDL IPO | త్వరలో ఐపీవోకు ఎన్‌ఎస్‌డీఎల్.. ఏకంగా 40శాతం పెరిగిన షేరు ధర

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NSDL IPO | డిపాజిటరీ సంస్థ నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (NSDL) త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. వచ్చేనెలలో ఐపీవో (IPO) ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీంతో అన్ లిస్టెడ్ స్పేస్​లో కంపెనీ షేర్ ధర పరుగులు తీస్తోంది.

ఆర్థిక, సెక్యూరిటీల మార్కెట్లలో అనేక ఉత్పత్తులు, సేవలు అందిస్తున్న ఎన్‌ఎస్‌డీఎల్‌ ఐపీవోకు రావడానికి చాలా ఏళ్ల క్రితమే సన్నాహాలు మొదలుపెట్టింది. దేశంలో అతిపెద్ద డిపాజిటరీ(Depository)గా ఉన్న ఎన్‌ఎస్‌డీఎల్‌ గతేడాది అక్టోబర్‌లోనే మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ(SEBI) నుంచి అనుమతులు పొందింది. రూ.3,421 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. 5.01 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనున్నట్లు సంబంధిత పత్రాల్లో పేర్కొంది. ఎన్‌ఎస్‌డీఎల్‌లో వాటాదారులైన ఐడీబీఐ (IDBI) బ్యాంక్‌ లిమిటెడ్‌, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(NSE) లిమిటెడ్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తమ వాటాలను తగ్గించుకోనున్నాయి. జూలైలో ముహూర్తం ఖరారయ్యే అవకాశాలున్నాయి.

NSDL IPO | అన్‌లిస్టెడ్‌ మార్కెట్‌లో కొనుగోళ్ల జోరు

ఎన్‌ఎస్‌డీఎల్‌ ఐపీవోకు వస్తుందన్న వార్తలతో అన్‌లిస్టెడ్‌ మార్కెట్‌(Unlisted market)లో ఈ షేరు ధరకు రెక్కలొచ్చాయి. రెండునెలల్లోనే ఏకంగా 40 శాతం పెరిగింది. మే నెలలోనే 30 శాతం పెరగడం గమనార్హం. కంపెనీ బలమైన ఆర్థిక పనితీరును కనబరచడం, ఐపీవోకు వస్తే మంచి లాభాలు వస్తాయన్న ఆశాభావంతో ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఏప్రిల్‌ ప్రారంభంలో షేరు ధర రూ. 995 గా ఉంది. ప్రస్తుతం రూ. 1,250కి చేరింది.

NSDL IPO | కంపెనీ పనితీరు..

ఎన్‌ఎస్‌డీఎల్‌ కంపెనీ గతేడాది బలమైన పనితీరును కనబరిచింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం (Revenue) అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 9.44 శాతం పెరిగి రూ. 394 కోట్లకు చేరింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో (financial year) కంపెనీ రూ. 358 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 79.5 కోట్లుగా ఉన్న నికరలాభం (Net profit) 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4.77 శాతం పెరిగి రూ. 83.3 కోట్లకు చేరుకుంది. అన్‌లిస్టెడ్‌ స్పేస్‌లో ఎన్‌ఎస్‌డీఎల్‌ షేరు ధర పెరగడానికి కంపెనీ లాభాలు పెరగడమూ ఒక కారణంగా భావిస్తున్నారు.