అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indian Railways | రైల్వే స్టేషన్లలో ప్రసిద్ధ సింగిల్-బ్రాండ్ ఫుడ్ అవుట్‌లెట్‌లను నిర్వహించడానికి రైల్వే శాఖ నిర్ణయించింది. మెక్‌డొనాల్డ్స్ (McDonald’s), కేఎఫ్‌సీ, పిజ్జా హట్ (Pizza Hut), బాస్కిన్ రాబిన్స్, బికనేర్‌వాలా, హల్దిరామ్ మొదలైన ప్రసిద్ధ సింగిల్-బ్రాండ్ ఫుడ్ అవుట్‌లెట్‌లను ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసినట్లు రైల్వే స్టేషన్లలో అనుమతించనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) సిఫార్సును ఆమోదిస్తూ ఈ ప్రతిపాదనను చేర్చడానికి రైల్వే బోర్డు క్యాటరింగ్ సేవలపై తన విధానాన్ని సవరించింది.
ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో టీ, కాఫీ, లైట్ స్నాక్స్‌కు మాత్రమే మూడు రకాల స్టాళ్లు ఉన్నాయి. ఇక నుంచి ప్రీమియం బ్రాండ్ క్యాటరింగ్ వర్గాన్ని కొత్తగా జోడించనున్నారు. దీంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్గనుంది. అయితే కంపెనీ యాజమాన్యంలోని, ఫ్రాంచైజీలతో నిర్వహించబడుతున్న ప్రీమియం సింగిల్-బ్రాండ్ ఫుడ్ అవుట్‌లెట్‌లను ఇ-వేలం ద్వారా అనుమతించవచ్చని రైల్వే బోర్డు తెలిపింది. డిమాండ్ ఉన్న ప్రాంతంలో మాత్రమే వాటిని ఏర్పాటు చేయనున్నారు. 2017 ప్రకారం పానీయాలు, స్నాక్స్, తేలికపాటి రిఫ్రెష్‌మెంట్‌లను విక్రయించడానికి రైల్వే స్టేషన్లలో మూడు రకాల ఫుడ్ స్టాల్స్ అనుమతించారు. తాజాగా నాలుగో రకం అవుట్‌లెట్ కింద ప్రీమియం బ్రాండ్ క్యాటరింగ్ అవుట్‌లెట్‌ను ప్రవేశపెట్టారు.
Indian Railways | ఐదేళ్ల పరిమితితో..
ప్రీమియం బ్రాండ్ క్యాటరింగ్ అవుట్‌లెట్ కాలపరిమితి ఇతర క్యాటరింగ్ స్టాళ్లకు వర్తించే విధంగా ఐదు సంవత్సరాలు ఉంటుంది. కనీస లైసెన్స్ రుసుము నిర్ణయంతో సహా అన్ని ఇతర మార్గదర్శకాలు ప్రస్తుత విధానానికి అనుగుణంగా ఉంటాయి. దీంతో ప్రధాన రైల్వే స్టేషన్లలో తొలుత వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అక్కడ వచ్చే స్పందన ఆధారంగా మిగతా చోట్ల సైతం ఏర్పాటు చేయనున్నారు.
దేశంలో ఎక్కువ మంది రైల్వేలపై ఆధారపడి ప్రయాణాలు చేస్తారు. రోజుకు సగటున 2.3 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. దీంతో కేఎఫ్‌సీ (KFC), మెక్‌డోనాల్డ్స్ వంటి ఔట్లెట్లు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. రైల్వేకు సైతం ఆదాయం వస్తుంది. ఐఆర్సీటీసీ (IRCTC) నెట్‌వర్క్‌లోని రైల్వే స్టేషన్లలో ఇప్పటికే ప్రయాణీకులకు 10 లక్షలకు పైగా భోజనాలు అందిస్తోంది. ప్రీమియం బ్రాండ్ ఫుడ్ అవుట్‌లెట్‌లు ప్రారంభం అయితే ప్రయాణికులకు భోజన సౌకర్యాలు పెరగనున్నాయి.
