INDVsENG
IND vs ENG | చెత్త బౌలింగ్‌.. నాలుగో టెస్ట్‌పై ప‌ట్టు బిగించిన ఇంగ్లండ్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : మాంచెస్ట‌ర్ (Manchester) వేదిక‌గా ఇంగ్లండ్‌తో England జరుతుగున్న‌ నాలుగో టెస్టులో టీమిండియా (Team India) బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైంది. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారత బౌలర్లు నిరాశపరిచారు.

మూడో రోజు ఆట మొదటి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ముఖ్యంగా భారత పేసర్లు చాలా తక్కువ స్థాయిలో రాణించారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అరంగేట్రం చేసిన అన్షుల్ కంబోజ్, శార్దూల్ ఠాకూర్ ఇంగ్లండ్ బ్యాటర్లను నిరోధించడంలో పూర్తిగా విఫలమయ్యారు. బ‌జ్‌బాల్ స్టైల్లో ఆడిన ఇంగ్లండ్ బ్యాటర్లు భారత్ బౌలింగ్‌ను దారుణంగా చీల్చి చెండాడారు.

IND vs ENG : రాణించని బౌల‌ర్స్..

ఓవర్‌సీస్ కండిషన్స్‌లో టీమిండియా గత 10 ఏళ్లలో తొలిసారిగా 500కి పైగా పరుగులు సమర్పించుకుంది. 2015లో సిడ్నీలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాకు australia 572 పరుగులు ఇచ్చిన తర్వాత మ‌ళ్లీ 500 ప‌రుగులు ఇవ్వ‌డం ఇది మొదటిసారి. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఇప్పుడు మాంచెస్టర్ టెస్ట్‌లో ఇంగ్లండ్ 135 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 544 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో జో రూట్ 248 బంతుల్లో 14 ఫోర్లతో అద్భుతమైన 150 పరుగులు చేయగా, ఓలీ పోప్ 71, కెప్టెన్ బెన్ స్టోక్స్ 77 నాటౌట్ చేసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు.

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా Ravindra Jadeja, వాషింగ్టన్ సుందర్ Washington Sunder చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, బుమ్రా Bumrah, అన్షుల్ ఒక్కొక్క వికెట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంగ్లండ్ ఇప్పటికే 186 పరుగుల ఆధిక్యంలో ఉంది.

మూడో రోజు తొలి సెషన్‌లోనే 100కి పైగా పరుగులు వచ్చాయి, కొత్త బంతితో కూడా భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. ఇప్పటికే మ్యాచ్ భారత పక్షాన లేదనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది. డ్రా కోసం మాత్రమే భారత్ పోరాడాల్సిన ప‌రిస్థితి.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రిషభ్ పంత్ 54, యశస్వి జైస్వాల్ 58, సాయి సుదర్శన్ 61 పరుగులతో హాఫ్ సెంచరీలు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు, క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ చెరో వికెట్ తీశారు. ఈ స్థితిలో టీమిండియా గేమ్‌లోకి తిరిగి రావడం చాలా కష్టమే. మ‌రి మ‌న బ్యాట‌ర్స్ ఏం చేస్తారో చూడాలి.