అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Minister Uttam Kumar Reddy | మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రెండురోజుల్లో వచ్చే అవకాశాలున్నాయని మున్సిపల్ ఎన్నికల జిల్లా ఇన్‌ఛార్జి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. నగరంలోని వంశీ హోటల్లో ఆదివారం నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్, మున్సిపాలిటీల సమీక్షకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో (Nizamabad Municipal Corporation) పాటు బోధన్, భీమ్‌గల్, ఆర్మూర్ మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
Minister Uttam Kumar Reddy | ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపాలిటీ ఎన్నికలు (municipal elections) జరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లకు గాను కేవలం రెండు డివిజన్లు మాత్రమే కాంగ్రెస్ గెలుపొందిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండేళ్లుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వీటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని పేర్కొన్నారు.
Minister Uttam Kumar Reddy | పేదల కుటుంబాల్లో వెలుగులు తీసుకొచ్చాం..
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతులు, యువత, రైతు కూలీల కుటుంబాల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం వెలుగులు నింపుతోందన్నారు. దేశంలోని 29 రాష్ట్రాలలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తూ తెలంగాణ ప్రభుత్వం రికార్డులను సృష్టిస్తోందన్నారు. బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలతో పాటు గత పదేళ్లలో తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు దొడ్డు బియ్యం అందిస్తే 90 శాతం మంది ప్రజలు వాటిని విక్రయించేవారన్నారు. దీంతో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం 3.17 కోట్ల ప్రజలకు రూ.13,600 కోట్లతో సన్నబియ్యాన్ని ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున అందజేస్తున్నట్లు వివరించారు. అలాగే కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేసిందని చెప్పారు.
Minister Uttam Kumar Reddy | అనుభవజ్ఞుడికే పార్టీ టికెట్..
అన్ని కోణాల్లో సర్వే చేపట్టిన తర్వాతే అనుభవజ్ఞులైన పార్టీ విధేయుడికే టికెట్ దక్కుతాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. టికెట్ రానివారు నిరాశ చెందకుండా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తే భవిష్యత్‌లో వారికి పార్టీలో సముచిత స్థానం దక్కుతుందన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
Minister Uttam Kumar Reddy | ప్రతి నాయకుడికి సముచిత స్థానం..
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఏ ఒక్క సీనియర్ కార్యకర్తను వదులుకోవాలని కోరుకోదన్నారు. వీరికి సముచిత న్యాయం కల్పిస్తుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పార్టీపరంగా అన్ని సర్వేలు నిర్వహించిన తర్వాతే పార్టీ విధేయుడికే టికెట్‌ను కేటాయించడం జరుగుతుందని, బంధువులకు తెలిసిన వారికి టికెట్ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. బీజేపీ ముఖ్య నాయకులు నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. 1931లో అధిక జనాభా ఉన్న నిజామాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడిందని ఇప్పటివరకు స్మార్ట్ సిటీకి నోచుకోలేదన్నారు. మన ముందు 1952లో ఏర్పడిన కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీగా మారిందన్నారు.
Minister Uttam Kumar Reddy | దేవుళ్ల పేరుతో ఓట్లు అడుగుతున్నారు..
బీజేపీ నాయకులు దేవుళ్ల పేర్లు చెప్పి ఓట్లు అడుగుతున్నారని.. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీనిని తిప్పి కొట్టాలని మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు, సన్నబియ్యం, ఉచిత కరెంటు, యువతకు ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం తీసుకుంటున్న పనులను ప్రతి గడపగడపకు తెలియజేయాలన్నారు. రెండేళ్లలో 85వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీలో మంచి గుర్తింపు లభిస్తుందని, ప్రతి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.