అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Wine Shops | రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో రెండు సంవత్సరాలకు ఒకసారి మద్యం దుకాణాల కోసం టెండర్లు నిర్వహిస్తారు. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్‌ల కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో మద్యం దుకాణాల (Liquor Stores) కోసం దరఖాస్తు చేసుకోవడానికి గతంలో రూ.రెండు లక్షలు ఫీజు వసూలు చేసేవారు. ప్రస్తుతం దానిని రూ.3 లక్షలకు పెంచారు. దీంతో ప్రభుత్వానికి దరఖాస్తుల రూపంలో భారీగా ఆదాయం రానుంది. ఇప్పటికే మద్యం ధరలను (Alcohol Prices) పెంచిన ప్రభుత్వం తాజాగా లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే ఫీజును పెంచడం గమనార్హం.
Wine Shops | డ్రా ద్వారా ఎంపిక
రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవడానికి రూ.3 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం డ్రా పద్ధతిలో వైన్ షాపులను (Wine Shops) ఎంపిక చేస్తారు. డ్రాలో వచ్చిన వారు రెండేళ్ల పాటు మద్యం దుకాణం నిర్వహించుకోవడానికి లైసెన్స్ ఇస్తారు. ఇందుకోసం మళ్లీ లైసెన్స్ ఫీజు (License Fee) చెల్లించాల్సి ఉంటుంది.
Wine Shops | టెండర్లలో రిజర్వేషన్లు
రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) గౌడ్‌లకు రిజర్వేషన్ అమలు చేయగా.. తాజాగా కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించింది. 6 శ్లాబ్‌లలో లైసెన్స్‌లు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖ (Excise Department) నిర్ణయించింది.
Wine Shops | లైసెన్స్ ఫీజులు
2011 జనాభా లెక్కలను అనుసరించి 5 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50లక్షల లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. 5 వేల నుంచి 50వేల జనాభా గల ప్రాంతాల్లో దుకాణాలకు రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న ఏరియాల్లో రూ.60 లక్షలుగా నిర్ణయించారు. లక్ష నుంచి 5 లక్షల జనాభాకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభాకు రూ.85 లక్షలు, 20 లక్షలపై చిలుకు జనాభా గల ప్రాంతంలోని దుకాణాలకు రూ.కోటి పది లక్షల ఫీజు నిర్ణయించారు.