అక్షరటుడే, కామారెడ్డి: Private Hospitals | ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న ఆస్పత్రులకు జరిమానాలు విధిస్తూ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
Private Hospitals | క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 (Clinical Establishments Act) అమలుపై కలెక్టరేట్లో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలన్నారు. అన్‌రిజిస్టర్డ్ ఆస్పత్రుల నివేదికలను డీఎంహెచ్‌వో విద్య (DMHO Vidya) ఆధ్వర్యంలో సేకరించి డీఆర్ఏ కమిటీకి (DRA Committee) సమర్పిస్తామన్నారు. జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ ఆమోదం మేరకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఆస్పత్రికి వచ్చిన రోగుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, రోగులకు సరైన చికిత్స అందించాలని సూచించారు. ఆస్పత్రి రిజిస్ట్రేషన్ సమయంలో డీఆర్ఏ కమిటీకి సమర్పించిన ప్రైస్ లిస్ట్, ప్రొసీజర్ల ప్రకారమే రోగుల వద్ద ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు. అనుమతి పొందిన ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది మార్పులు జరిగితే వాటిని తప్పనిసరిగా జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీకి తెలియజేయాలన్నారు. ప్రతినెలా డీఎంహెచ్‌వో కార్యాలయానికి స్కానింగ్ రిపోర్టులు, సీ-సెక్షన్ రిపోర్టులు, అబార్షన్ రిపోర్టులు తదితర అవసరమైన నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
Private Hospitals | వైద్యులు గౌరవం కాపాడుకోవాలి
సమాజంలో వైద్యులకు ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్ అన్నారు. మానవతా దృక్పథంతో రోగులకు సేవలందించాలని, ఫీజుల విషయంలో స్పష్టత పాటించాలని సూచించారు. డాక్టర్లకు ఏవైనా సమస్యలు ఉంటే ఐఎంఏ అసోసియేషన్ ద్వారా కలెక్టర్‌కు తెలియజేయవచ్చని తెలిపారు. జిల్లా వైద్యాధికారి డా.విద్య మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై రూ.50 వేల నుండి రూ.5 లక్షల వరకు జరిమానా విధించడంతో పాటు, అవసరమైతే సీజ్ చేయడం, క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సమావేశంలో పీవోడీఆర్ఏ శిరీష, వెంకట్ స్వామి, డెమో వేణుగోపాల్, హెచ్‌వో చలపతి, అధికారులు, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్యులు పాల్గొన్నారు.