అక్షరటుడే, భీమ్గల్: Banakacherla | తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం బనకచర్ల ప్రాజెక్టును (Bnakacherla) ఎలాగైనా కట్టి తీరుతామన్న ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara lokesh) వాఖ్యలపై ఇటు రాష్ట్ర బీజేపీ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం సరికాదని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Mla prashanth reddy) అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం ముందుకు తీసుకువెళ్తోందని లోకేష్ మాటలను బట్టి అర్ధం అవుతోందన్నారు. బీజేపీ, టీడీపీ చేతిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) కీలుబొమ్మలా మారాడని దుయ్యబట్టారు.
తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా ఏ ఒక్కరు కూడా బనకచర్లపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. తమ పదవులు కాపాడుకోవడం కోసం నోరుమెదపడం లేదన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాటలను తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఇరు పార్టీలు ఖండించకపోవడం దారుణమన్నారు. గతంలో బనకచర్లపై చర్చల కోసం ఢిల్లీ వెళ్లేది లేదన్న సీఎం రేవంత్.. ఢిల్లీ బయలుదేరి వెళ్లడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
తన గురువైన చంద్ర బాబు మెప్పుకోసం కేంద్ర పెద్దల సహకారంతో తన స్వప్రయోజనాల కోసం తెలంగాణాను తాకట్టు పెడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం చేసే వారిని అడ్డుకుంటామని, తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్షా అన్నారు. రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న అన్యాయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.