KTR
KTR | ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదది.. ఎన్డీయే రిపోర్టు..డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక‌పై కేటీఆర్ ధ్వ‌జం

అక్షరటుడే, వెబ్​డెస్క్​:KTR | మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage)కు సంబంధించి జాతీయ ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త సంస్థ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదిక‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ కేటీఆర్(KTR) మ‌రోసారి ధ్వ‌జ‌మెత్తారు. మేడిగడ్డ బ్యారేజి గురించి ఎన్డీఎస్ఏను ఎల్‌ అండ్ టీ అడిగిన ప్రశ్నతో ఇది తప్పుడు నివేదిక అని తేలిందన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు(NDSA Report) బూట‌క‌మ‌ని తాము చెబుతున్న‌ది నిజ‌మ‌ని ఎల్అండ్‌టీ సంస్థ(L&T Company) లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌తో తేలిపోయింద‌న్నారు. మేడిగ‌డ్డ‌పై ఇచ్చిన నివేదిక ఎన్డీఎస్ఏది కాద‌ని, ఎన్డీయేద‌ని ఆరోపించారు. ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని సీఎం రేవంత్ చెప్పడం దివాళాకోరు విధానాలకు నిదర్శనమంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ విరుచుకుపడ్డారు.

KTR | మేము చెప్పిందే నిజ‌మ‌ని తేలింది.

మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్(BRS) చెబుతున్నది అక్షరాలా నిజమని తేలిపోయిందని కేటీఆర్ అన్నారు. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పులతడక అని రుజువైందన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఏఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు(Congress Government), కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి(BJP Government) పూర్తిగా చెంపపెట్టు లాంటిదేనని విమ‌ర్శించారు. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకుని, ఏడాదిన్నర దాకా సాగదీసి ఇటీవల ఇచ్చిన తుది నివేదిక వరకూ రెండింటిలోనూ అడుగడుగునా వ్యత్యాసాలు, పొంతనలేని అంశాలుండటం నివేదిక‌లోని డొల్లతనాన్ని బయటపెట్టిందన్నారు.

KTR | కేసీఆర్‌కు పేరొస్తుంద‌నే క‌క్ష‌తోనే..

పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్(Chief Minister Revanth), రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాళాకోరు విధానాలకు నిదర్శనమని కేటీఆర్(KTR) ఆరోపించారు. కేసీఆర్‌కు పేరొస్తుందనే రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంను పక్కనపెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారన్నారు. ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండగొట్టి, 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మరిచిపోయి, మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీ(Cold Storage)లోకి నెట్టడం దుర్మార్గమన్నారు. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌పై బురదజల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్ – బీజేపీ, ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయా డ్రామాకు తెరతీశారన్నారు. ప్రాజెక్టు ప్రణాళికల నుంచి నిర్మాణ నాణ్యత వరకూ అడుగడుగునా ఎక్కడా రాజీ పడకుండా కట్టిన ప్రాజెక్టుపై బురదజల్లడం మాని, ఇకనైనా ఎల్ అండ్ టీ అభ్యంతరాలకు ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.