అక్షరటుడే, ఎల్లారెడ్డి : Jajala Surender | ఎల్లారెడ్డి ప్రజలు, రైతులను పరామర్శించి ప్యాకేజీ ఇవ్వాల్సిన సీఎం.. విహారయాత్రకు వచ్చి వెళ్లినట్లుందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్(Jajala Surender) ఎద్దేవా చేశారు.ఈమేరకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో(Telangana bhavan) శుక్రవారం ఆయన మాట్లాడారు.
లింగంపేట(Lingampet)లో కేవలం చిన్నవంతెనకు ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోతే ఆ రోడ్డును చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చారని.. వేల ఎకరాల్లో పంటనష్టం కనిపించలేదా.. అని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. నాగిరెడ్డిపేటలో 5వేల మంది రైతులు.. రాజంపేటలో 4 వేలు మంది, ఎల్లారెడ్డి 3వేల మంది రైతులు నష్టపోయారన్నారు. కేవలం ఫొటో ఎగ్జిబిషన్ చూసి సీఎం కామారెడ్డి వెళ్లిపోయారని..ఎల్లారెడ్డి రైతులంటే అంత చులకననా అని జాజాల ప్రశ్నించారు.
Jajala Surender | సత్వర న్యాయం కావాలి..
బీఆర్ఎస్ హయాంలో వరద నష్టం జరిగితే ఆయా ప్రాంతాలను కేసీఆర్ సందర్శించి తక్షణమే నష్టపరిహారం అందజేసేవారన్నారు. కానీ సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) మాత్రం సమీక్షిస్తాం.. చూస్తాం.. చేస్తాం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సత్వరం సాయం చేయాలని డిమాండ్ చేశారు. 19,530 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. పంటపొలాల్లో ఇసుక మేటలు వేసిందని.. పెద్ద పెద్ద రాళ్లు పొలాల్లోకి వచ్చాయని.. రైతు తిరిగి సాగు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు