అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ మహా నగరంలోని కీలకమైన ఫ్లైఓవర్ పేరు మారింది. లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి సచివాలయం వరకు గతంలో నిర్మించిన ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌గా మారింది.
2005లో నిర్మించిన ఈ వంతెనను గతంలో ‘తెలుగుతల్లి ఫ్లైఓవర్’ అని పిలిచే వారు. అయితే, తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం గడిచిపోయినా ఇంకా అదే పేరును కొనసాగించడంపై ఇటీవల కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’(Telangana Thalli Flyover)గా మారుస్తూ తాజాగా బోర్డు ఏర్పాటు చేసింది.
Hyderabad | మారిన పేరు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్‌యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. దీనికి ’తెలుగు తల్లి’ అని నామకరణం చేసి ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ పేరు మార్చాలనే డిమాండ్ వినిపించింది. అయితే, బీఆర్ఎస్ సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరోసారి ఫ్లైఓవర్ పేరు మార్పు అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో గత వారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీలో పేరు మార్చాలని తీర్మానించారు. దీంతో ఫ్లైఓవర్ పేరు మారిపోయింది. ఈ మేరకు తెలంగాణ తల్లి అని సూచిస్తూ నూతన సుచిక బోర్డులను పెట్టారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి సచివాలయం వరకు విస్తరించి ఉన్న ఈ ఫ్లైఓవర్‌కు ఇకపై ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్’ అని పేరు మార్చగా.. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని గుర్తింపును ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు(GHMC Officers) తెలిపారు.