అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (IMD) తెలిపారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణ నుంచి వెళ్లిపోయాయి. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు గురువారం తెలంగాణలో ప్రవేశించాయి.
ఏ ఏడాది రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించాయి. మే నెలలోనే తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చాయి. అనంతరం భారీ వర్షాలు పడ్డాయి. ఒక్క జూన్లో మినహా మిగతా నెలల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయింది.
Weather Updates | ఆ జిల్లాలకు ఊరట
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలోని నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల్, నల్గొండ జిల్లాల్లో రానున్న రెండు రోజులు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) సహా మిగతా ప్రాంతాల్లో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పడటం లేదు. అక్కడక్కడ చిరుజల్లులు పడినా.. పెద్ద వానలు లేకపోవడంతో అన్నదాతలు (Farmers) వరి కోతలు జోరుగా చేపడుతున్నారు. ఈ సమయంలో వర్షాలు లేవని అధికారులు చెబుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Weather Updates | మళ్లీ వర్షాలు అప్పుడే..
రాష్ట్రంలో మళ్లీ అక్టోబర్ 21 తర్వాత వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వానలు పడుతాయన్నారు. ప్రస్తుతం వానలు లేకపోవడంతో రైతులు పంట కోసి ధాన్యం ఆరబోస్తున్నారు. వర్షాలు లేనిసమయంలో కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతున్నారు. ఒకవేళ వానలు పడితే వడ్లు తడిసిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం సేకరణ (Paddy Purchase) ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
Weather Updates | ఆ రాష్ట్రాలకు..
ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కోస్తాంధ్ర, కర్ణాటక, కేరళలలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. వీటి ప్రభావంతో ఆ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అది బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది.