అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | దేశంలోని అనేక పోలీసుస్టేషన్లలో సీసీ కెమెరాలు పని చేయక పోవడంపై సుప్రీంకోర్టు గురువారం సుమోటోగా కేసును స్వీకరించింది. అనేక ఠాణాల్లో కెమెరాలు పనిచేయడం లేదని ఓ వార్తాపత్రిక(Newspaper)లో వచ్చిన కథనంపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద కేసు విచారణకు స్వీకరించింది. గత 7-8 నెలల్లో ఒక్క రాజస్థాన్‌లోనే 11 మంది పోలీసు కస్టడీలో మృతి చెందారని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఎత్తి చూపింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు(Supreme Court) ఈ అంశాన్ని వెంటనే పరిగణనలోకి తీసుకుంది.
Supreme Court | సీసీటీవీలు తప్పనిసరి..
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో(Police Staions) నైట్ విజన్, ఆడియో రికార్డింగ్ చేసే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు 2020లోనే ఆదేశించింది. కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు లాక్-అప్‌లు, విచారణ గదులతో సహా పోలీసు ప్రాంగణంలోని అన్ని కీలకమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు(CC Cameras) ఏర్పాటు చేయాలి. కనీసం 18 నెలల పాటు ఫుటేజ్‌ను భద్రపరచాలని న్యాయస్థానం అప్పట్లోనే కీలక ఆదేశాలు జారీ చేసింది. కస్టోడియల్ హింస లేదా మరణాలకు సంబంధించిన దర్యాప్తు సమయంలో వీటిని అందుబాటులో ఉంచాలని నొక్కి చెప్పింది.
Supreme Court | అనేక ఉల్లంఘనలు.. సవాళ్లు
కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అనేక పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదు. లేదా ఫుటేజ్ కనిపించడం లేదు, ఇది తరచుగా దర్యాప్తుతో పాటు పోలీసుల జవాబుదారీతనానికి ఆటంకంగా మారింది. కస్టడీ దుర్వినియోగానికి సంబంధించిన కేసులలో సాంకేతిక సమస్యలు లేదా ఫుటేజ్ అందుబాటులో లేకపోవడం వంటి వాటిని పోలీసు విభాగాలు అడ్డంకులుగా పేర్కొంటున్నాయి. సుప్రీం కోర్టు తాజాగా సుమోటో(Sumoto) తీసుకోవడం.. సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణలో కొనసాగుతున్న లోపాలను బయటకు తీసుకొచ్చింది.
Supreme Court | పర్యవేక్షణ కరువు..
సీసీ కెమెరాల వ్యవస్థల సేకరణ, స్థాపన. నిర్వహణను నిర్ధారించే పనిలో ఉన్న రాష్ట్ర, కేంద్ర పర్యవేక్షణ కమిటీల పాత్రను కూడా కోర్టు ఈ సందర్భంగా హైలైట్ చేసింది. తీవ్రమైన గాయాలు లేదా కస్టడీ మరణాలకు సంబంధించిన కేసులలో బాధితులు లేదా వారి కుటుంబాలు మానవ హక్కుల కమిషన్లు లేదా కోర్టులను సంప్రదించవచ్చని ఆదేశించింది. కస్టోడియల్ హింస, చావుల నేపథ్యంలో సీసీ టీవీ ఫుటేజ్ కీలక సాక్ష్యంగా ఉంటుంది. కానీ, వేలాది ఠాణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. కెమెరాలు పని చేయకపోవడం, వీడియో, ఆడియోల స్పష్టత లేకపోవడం వంటి సమస్యలను ఏమాత్రం పరిష్కరించడం లేదు.