అక్షరటుడే, లింగంపేట: TGS RTC | జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఓచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఆర్టీసీబస్సు ప్రమాదాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నా ఆర్టీసీ ప్రమాదాలు (RTC Accidents) మాత్రం ఆగడం లేదు. ఏదో ఒకచోట ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం, అధికంగా ప్రాణనష్టం జరుగుతుండడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
TGS RTC | అవగాహన కల్పిస్తున్నా..అంతే..
ఆర్టీసీబస్సు (RTC Bus)లో ప్రయాణిస్తే సురక్షితంగా గమ్యస్థానానికి చేరుతారనే నమ్మకం ప్రయాణికుల్లో ఉండేది. కాని ఇటీవల వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అద్దె బస్సులతో ప్రమాదాలు జరుగుతున్నా చెడ్డపేరు మాత్రం ఆర్టీసీకే వస్తోంది. తరచూ యాక్సిడెంట్లు చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లకు(RTC Drivers) అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రమాదాల కారణంగా ఆర్టీసీ ప్రతి ఏడాది రూ.కోట్లల్లో నష్టం పరిహారం కింద చెల్లించాల్సి వస్తోంది. బస్సుల నిర్వహణ సక్రమంగా లేదనే విమర్శలూ ఉన్నాయి.
TGS RTC | ట్రాక్టర్ డ్రైవర్.. బస్ డ్రైవర్‌గా మారితే..
ఆర్టీసీలో ప్రస్తుతం నడుస్తున్న అద్దె బస్సులకు డ్రైవర్లు (Rental Buses Drivers)గా ఉన్నవాళ్లు ఒకప్పుడు ట్రాక్టర్లు నడిపినవారే ఎక్కువగా ఉండడం గమనార్హం. వీరికి మొదట్లో నామమాత్రంగా శిక్షణ ఇచ్చి తీసుకోవడంతో వారివల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. వారికారణంగా ఆర్టీసీ ప్రతిష్ట మసకబారుతోందని.. సురక్షిత ప్రయాణం అనేది ఆర్టీసీలో కనుమరుగయ్యే అవకాశం ఉందని వారంటున్నారు. వారికి నైపుణ్యత పరీక్షలు నిర్వహించాకే తిరిగి బస్సు స్టీరింగ్ అప్పజెప్పాలని కోరుతున్నారు.
TGS RTC | ఇటీవల జరిగి ప్రమాదాలివే..
1) లింగంపేట మండల కేంద్రంలో నెలరోజుల క్రితం ఓ విద్యార్థి ఆర్టీసీ బస్సులో నుంచి కిందపడి ప్రాణాలతో బయటపడ్డాడు ఆ బస్సు మూలమలుపు వద్ద వేగాన్ని డ్రైవర్ కంట్రోల్ చేయకపోవడంతో బాలుడు కిందపడ్డాడని సమాచారం.
2) లింగంపేట మండలం ఎల్లమ్మ తండా సమీపంలో ఈనెల 19న కల్వర్టు పైన ఆర్టీసీ బస్ ఇసుక లారీ ఢీకొనడంతో 8మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇసుక లారీ, బస్సు పోటాపోటీగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని.. బస్సులో 100మంది ప్రయాణికులు ఉన్నప్పుడు డ్రైవర్‌కు ఓపిక ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని ప్రయాణికులు పేర్కొన్నారు.
3) రెండు నెలల క్రితం రాజంపేట మండల కేంద్ర సమీపంలోని ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.