PCC Chief
PCC Chief | త్వరలో నామినేటెడ్​ పోస్టుల భర్తీ.. పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్​: PCC Chief | రాష్ట్రంలో త్వరలో నామినేటెడ్​ పోస్టులు భర్తీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ (PCC President Bomma Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​, బీజేపీ నాయకులు (BRS and BJP leaders) పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టి ఇటీవల ఏడాది పూర్తికావడంతో పాటు తాజా రాజకీయాల నేపథ్యంలో ‘అక్షరటుడే’తో (Akshara today) ఆయన పలు విషయాలు పంచుకున్నారు.

PCC Chief | నామినేటెడ్​ పదవుల్లో సీనియర్లకు ప్రాధాన్యం

నామినేటెడ్​ పదవుల భర్తీ విషయంపై ఆయన స్పందిస్తూ.. ‘పదవుల కోసం పార్టీలో అసంతృప్తి ఉంది వాస్తవమే. దీంతో కొంచెం గ్యాప్​ ఏర్పడుతోంది. నవంబర్​ చివరిలోపు నామినేటేడ్​ పదవులను భర్తీ చేస్తాం. సీనియర్లకు ప్రాధానత్య ఇస్తాం. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు దక్కుతాయి. కొత్త వారిని ప్రోత్సహించేందుకు 20 శాతం పదవులు వారికి కూడా ఇస్తాం. పదవులు రాని వారు నిరుత్సాహ పడకుండా పార్టీ కోసం పని చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.’

PCC Chief | చట్టబద్ధత వచ్చాకే..

బీసీ డిక్లరేషన్​ హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు (BC reservations) తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ మేరకు బిల్లులు అసెంబ్లీలో ఆమోదించాం. అయితే అవి కేంద్రం వద్ద పెండింగ్​లో ఉన్నాయి. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ఈ నెలాఖరు వరకు రానుంది. బీసీ రిజర్వేషన్లు అమలయ్యాకే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం. సుప్రీం తీర్పునకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్​ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తాం. బీసీలకు న్యాయం జరిగేలా చూస్తాం. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తాం.

PCC Chief | 75 వేల ఉద్యోగాలు భర్తీ

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే 75 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. నేను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక పార్టీలోనూ పలు కీలక మార్పులు తీసుకు వచ్చాం. మంత్రులు కూడా గాంధీ భవన్​లో (Gandhi Bhavan) కూర్చొని కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించే పద్ధతి ప్రవేశ పెట్టాం.

PCC Chief | బీసీలకే జూబ్లీహిల్స్​ టికెట్​!

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-elections) కాంగ్రెస్​ పార్టీ విజయం సాధిస్తుంది. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తాం. దేశంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ (Hyderabad) ఒకటి. మేము అధికారంలోకి వచ్చాక హైదరాబాద్​ రూపురేఖలు మార్చేశాం. కాబట్టి జుబ్లీహిల్స్​లో కచ్చితంగా గెలుస్తాం. అభ్యర్థి ఎవరనేదానిపై సమాలోచనలు జరుగుతున్నాయి. బీసీలకు టికెట్​ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

PCC Chief | కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలి

యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వ (central government) పరిధిలో ఉంటుంది. కేంద్రం పంపిన యూరియాను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తుంది. కేంద్రం నుంచి సరిపడా యూరియా రాకపోవడంతోనే కొరత ఏర్పడింది. దీనిపై కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్​ (Bandi Sanjay) సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి లోపం లేదు. కావాలనే మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.

PCC Chief | రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతం

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి (MLA Rajagopal Reddy) ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి, ప్రభుత్వంపై వరుసగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మహేశ్​గౌడ్​ స్పందిస్తూ.. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవి. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో ఆయన మాట్లాడుతున్నట్లు ఉన్నారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా తప్పకుండా చర్యలుంటాయి.