అక్షరటుడే, వెబ్‌డెస్క్: PACS | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ సహకార సంఘాలకు ఇక నుంచి ఎన్నికలు నిర్వహించకుండా.. నామినేటెడ్ విధానంలో పదవులు భర్తీ చేయనుంది.
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(PACS)కు గతంలో ఎన్నికలు నిర్వహించేవారు. డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరిగేవి. అనంతరం డైరెక్టర్లలో ఒకరిని ఛైర్మన్‌గా, మరోకరిని వైస్‌ఛైర్మన్‌గా ఎన్నుకునేవారు. అయితే ప్రభుత్వం ఇక నుంచి ఎన్నికలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 19న సొసైటీ, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (DCCB) పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో త్వరలో ఎన్నికలు నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం నామినేటెడ్ విధానంలో పదవులు భర్తీ చేయాలని చూస్తోంది.
PACS | ఏఎంసీల తరహాలో..
రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలను ప్రభుత్వం నామినేటెడ్ విధానంలో భర్తీ చేస్తోంది. ఇదే తరహాలో సొసైటీ పాలక మండళ్లను నియమించాలని యోచిస్తోంది. దీంతో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు పదవులు దక్కుతాయి. అంతేగాకుండా ఎన్నికల నిర్వహణ భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతిలోపు పాలకవర్గాలను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
PACS | 13 మందితో..
ప్రతి సొసైటీలో 13 మందితో పాలకవర్గం ఏర్పాటు చేస్తారు. ఇందులో ఛైర్మన్, వైస్ ఛైర్మన్, 11 మంది డైరెక్టర్లు ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మూడు డైరెక్టర్ పోస్టు (Director Post)లను రిజర్వ్ చేయనున్నట్లు తెలిసింది. సొసైటీల్లో సభ్యత్వం ఉన్నవారిని మాత్రమే నియమించనున్నారు. రాష్ట్రంలో సహకార సంఘం ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వీటి ద్వారానే డీసీసీబీ డైరెక్టర్, ఛైర్మన్, డీసీఎంఎస్, టెస్కాబ్, మార్క్‌ఫెడ్ ఛైర్మన్లను ఎన్నుకుంటారు. సొసైటీ ఎన్నికల సమయంలో గొడవలు సైతం జరుగుతాయి. అలాగే క్యాంపుల ఏర్పాటు, హోరాహోరీ పోరు సాగుతుంది. దీంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ విధానంలో పదవులు భర్తీ చేయాలని యోచిస్తోంది.
PACS | పదవుల జాతర
రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత 187 మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించింది. దీంతో ఎంతో మంది అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు పదవులు వచ్చాయి. అయితే మిగతా నామినేటెడ్ పోస్టు (Nominated Post)ల కోసం నాయకులు ఎదురు చూస్తున్నారు. నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ప్రకటించారు. అయితే సొసైటీ పాలకవర్గాలను సైతం నామినేటెడ్ విధానంలో నియమిస్తే అధికార పార్టీలో పదవుల జాతర సాగనుంది. అనేక మంది నాయకులు, కార్యకర్తలకు పదవులు వచ్చే అవకాశం ఉంది.