అక్షరటుడే, ఇందూరు: Jagruti Nizamabad | కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) ద్వారా ఉమ్మడి జిల్లాలోని ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని కల్వకుంట్ల కవిత అన్నారని.. ఆ మాటలు వాస్తవమేనని జాగృతి జిల్లా అడ్‌హక్ కమిటీ (Jagruti District Ad-Haq Committee) సభ్యుడు అవంతి కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021 కొండపోచమ్మ సాగర్ (Kondapochamma Sagar) నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్‌కు గోదావరి నీళ్లు చేరాయన్నారు. అయితే.. ఆ ఏడాది యాసంగి సీజన్‌ను కాపాడేందుకు మాత్రమే ఉపయోగించారని అన్నారు. ఆ తర్వాత నిజాంసాగర్‌కు ఎప్పుడూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్‌కు నీటిని అందించాల్సిన అవసరం రాలేదన్నారు.
2023 జూలైలో ఎస్సారెస్పీ పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా 2.50 టీఎంసీల నీటిని ఎత్తిపోశారన్నారు. ఆ తర్వాత ఎగువ నుంచి వరద రావడంతో ఎత్తిపోసిన నీటితోపాటు వరద నీరు స్పిల్‌వే గేట్ల ద్వారా గోదావరిలోకి అటు నుంచి సముద్రంలోకి చేరడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) ప్రచారాలు చేస్తూ శ్రీరామ్ సాగర్‌ను కాళేశ్వరం నీళ్లతో నింపామని చెప్పటం తగదన్నారు.
శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం ప్రాజెక్టు ఇరిగేషన్ చరిత్రలోనే అత్యంత అవినీతి ప్రాజెక్టు అని ఆయన ఆరోపించారు. రూ.1,067 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు నాలుగేళ్లలో రూ.2వేల కోట్లకు చేరిందని విమర్శించారు. ఈ సమావేశంలో జాగృతి ప్రతినిధులు సూదం రవిచందర్, గంగారెడ్డి, రాజు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.