అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Trump) ప్రకటించారు. రష్యా (Russia) నుంచి చమురు కొంటుందన్న కారణం చూపుతూ ఇప్పటికే రెండు విడతల్లో కలిపి 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. సమస్య పరిష్కారమయ్యే వరకూ భారత్‌తో ఎలాంటి చర్చలు ఉండవని తాజాగా తెలిపారు. పాకిస్తాన్‌తో యుద్ధం తర్వాత ట్రంప్ తరచూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ప్రకటించారు. అదే సమయంలో రష్యాతో సన్నిహితంగా ఉంటుండడంపై ఆగ్రహంతో ఉన్న ట్రంప్.. గత నెల 31న భారత్‌పై 25 శాతం టారిఫ్ విధించారు. అది అమలులోకి వచ్చేలోపే అదనంగా 25 శాతం పెంచారు. ఈ నేపథ్యంలో భారత్ దీటుగా స్పందించింది. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రకటించారు.
మరోవైపు, వాణిజ్య సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్ యత్నిస్తోంది. అయితే, అందుకు ట్రంప్ సిద్ధంగా లేరు. ఇదే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇండియా, అమెరికా (India-America) మధ్య వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని మీరు ఆశిస్తున్నారా విలేకరులు ప్రశ్నించగా “లేదు, సమస్య పరిష్కరించే వరకు కుదరదు” అని బదులిచ్చారు.
Donald Trump | ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా..
మరోవైపు, అమెరికా విదేశంగా శాఖ అధ్యక్షుడి వ్యాఖ్యలకు విరుద్ధంగా ప్రకటన చేసింది. భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, ఆ దేశంతో వాణిజ్య చర్చల్లో పూర్తి స్థాయిలో పాల్గొంటామని ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ మాట్లాడుతూ.. భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని తెలిపారు. టారిఫ్‌ల నేపథ్యంలో ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతున్నప్పటికీ, భారత్‌తో వాణిజ్య చర్చల్లో పూర్తి స్థాయిలో పాల్గొంటామని చెప్పారు. వాణిజ్యం, రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో ట్రంప్ పూర్తి స్పష్టతతో ఉన్నారని తెలిపారు. ప్రస్తుత కఠిన పరిస్థితులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
Donald Trump | 50 శాతం టారిఫ్‌లు
ట్రంప్ బుధవారం భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకాలను విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీనితో కొన్ని మినహాయింపులు మినహా భారతీయ ఉత్పత్తులపై విధించిన మొత్తం సుంకాలు 50 శాతానికి పెరిగాయి. ట్రంప్ విధించిన మునుపటి 25 శాతం సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ, అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలులోకి వస్తాయి.
Donald Trump | ట్రంప్‌కు మోదీ దీటైన సమాధానం
అమెరికా అధ్యక్షుడి సుంకాలకు కేంద్ర ప్రభుత్వం దీటైన సమాధానం ఇచ్చింది. సుంకాల పెంపు అన్యాయం, అసమంజసమని పేర్కొంది. మరోవైపు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడికి బలంగా సమాధానమిచ్చారు. తమ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని తేల్చి చెప్పారు. “మాకు, మా రైతుల (Farmers) ప్రయోజనాలే ప్రాధాన్యం. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలపై భారత్ ఎప్పటికీ రాజీపడదు. అందుకు తగిన మూల్యం చెల్లించడానికైనా సిద్ధం. అందుకు భారతదేశం సిద్ధంగా ఉంది” అని ప్రధాని మోదీ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ అన్నారు.
Donald Trump | ఇండియాకు మద్దతుగా రష్యా, చైనా
ప్రస్తుత వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా, చైనా (China) భారత్‌కు మద్దతుగా నిలిచాయి. ట్రంప్ సుంకాలు (Trump Tariffs) విధించడాన్ని తీవ్రంగా ఖండించాయి. ఇండియాపై ట్రంప్ సుంకాలను ఖండిస్తూ.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి బలమైన ప్రకటన విడుదల చేశారు. అమెరికా నిర్ణయం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. అదేవిధంగా, రష్యా కూడా భారతదేశం వైపు నిలిచింది. ఇటీవల జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ కూడా మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin)ను కలిశారు. న్యూఢిల్లీ, మాస్కో మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంచడంపై దృష్టి సారించారు. దోవల్ పర్యటన తర్వాత, పుతిన్ త్వరలో భారతదేశాన్ని సందర్శిస్తారని ప్రకటించారు.