అక్షరటుడే, వెబ్డెస్క్:B-Tax | బిల్లులు రావాలంటే చేతులు తడపాల్సిందే. చేసిన పనికి పైసలు రావాలంటే పర్సంటేజీలు ముట్టజెప్పాల్సిందే.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు(Congress government)లో అవినీతి తారస్థాయికి చేరింది. కమీషన్ల పర్వానికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఏకంగా 20 శాతం కమీషన్ చెల్లించుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. ప్రభుత్వంలోని కీలక మంత్రి అక్రమాల పర్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సదరు మంత్రి 20 శాతం కమీషన్ ఇస్తేనే గానీ బిల్లుల మంజూరుకు ఆమోదముద్ర వేయడం లేదు. ఆయన గారు అనుమతిస్తేనే గానీ ఖజానా నుంచి పైసా వచ్చే పరిస్థితి లేదు. దీంతో కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులు ఆందోళన చెందుతున్నారు.
B-Tax | పెండింగ్ బిల్లులు కోట్లల్లోనే..
రాష్ట్రంలో వేలాది కోట్ల బిల్లులు నిలిచి పోయాయి. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా ఆగిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అప్పటి ప్రభుత్వం గ్రామాల్లో భారీగా పనులు మంజూరు చేసింది. సీసీ, మెటల్ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, అదనపు గదుల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. అలాగే, కాంగ్రెస్ వచ్చాక అవసరమైన చోట ఆయా పనులకు ఆమోదం తెలిపింది. అయితే, కేసీఆర్ హయాంలో చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాలేదు. ఏదో నాలుగు రూపాయలు వస్తాయనే ఆశతో అప్పట్లో సర్పంచులు సైతం అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారు. కానీ ప్రభుత్వం మారడం, ఖజానా ఖాళీ కావడంతో బిల్లులు చెల్లించలేని దుస్థితి నెలకొంది.
B-Tax | బీ-ట్యాక్స్ కడితేనే..
కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్(Bills Pending)లో పెడడంతో కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. తమ బిల్లులు ఇప్పించాలని కింది నుంచి పైస్థాయి వరకూ అందరినీ వేడుకుంటున్నారు. దాదాపు రెండున్నరేళ్లు అయిపోయిందని, అప్పు తెచ్చి చేసిన పనులకు వడ్డీ కూడా కట్టలేక పోతున్నామని వాపోతున్నారు. అయితే, ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు. దీన్ని అవకాశంగా మార్చుకున్న కీలక మంత్రి ఒకరు.. కమీషన్ల పర్వానికి తెరలేపారు. 20% కమీషన్ (Commission) ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తామని సదరు అమాత్యుడు తన వద్దకు వచ్చే కాంట్రాక్టర్లకు( contractors) స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. మాట్లాడేది ఏమీ లేదని, డబ్బులు ఇచ్చి బిల్లులు తీసుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం.
B-Tax | వడ్డీ కట్టలేక.. కమీషన్లు ఇవ్వలేక..
బిల్లుల కోసం వెళ్తే 20 పర్సంటేజీ(20 percent) చెల్లిస్తేనే మంజూరు చేస్తామంటున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. బీ ట్యాక్స్ కట్టకపోతే బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులు వాపోతున్నారు. పైగా గతంలో 10% ఉన్న బీ ట్యాక్స్ ఇప్పుడు 20% కు పెరిగిందని, అది కట్టినా కూడా కొన్నిసార్లు ఖజానాలో డబ్బులు లేవని బిల్లులు ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అటు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, ఇటు సదరు అమాత్యుడికి 20% కమీషన్ చెల్లించుకోలేక కొందరు మాజీ సర్పంచులు ఆత్మహత్యాయత్నానికి సైతం పాల్పడ్డారు.
B-Tax | ప్రభుత్వం స్పందించేనా?
ప్రభుత్వంలోని కీలక మంత్రి అవినీతి వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. ఇదే అంశాన్ని బీజేపీ(BJP) కూడా ఎత్తిచూపుతోంది. బీ ట్యాక్స్ కట్టకపోతే బిల్లులు చెల్లించడం లేదని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Yeleti Maheshwar Reddy) ఆరోపించారు. కొన్ని సార్లు బీ ట్యాక్స్ చెల్లించినా కూడా బిల్లులు చెల్లించడంలేదని కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులు వాపోతున్నారని తెలిపారు. మరోవైపు, బీఆర్ఎస్ ఇప్పటికే మంత్రుల అవినీతి వ్యవహారంపై తరచూ ఆరోపణలు చేస్తూనే ఉంది. “మిస్టర్ 10 పర్సంటేజ్” అని ఇప్పటికే ఓ మంత్రి అక్రమాలపై విమర్శల పర్వం ఎక్కుపెట్టింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో టాప్-3లో ఉన్న కీలక మంత్రే ఇలా వ్యవహరించడంతో కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.