అక్షరటుడే, కామారెడ్డి: Collector Kamareddy | జిల్లాలో యూరియా కొరత లేదని, యాసంగి పంటకు సరిపడా అందుబాటులో ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు.
Collector Kamareddy | అన్ని కౌంటర్లలో విక్రయాలు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని కౌంటర్లలో యూరియా విక్రయం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. యూరియా కొనుగోలు చేసే రైతు ఆధార్ కార్డు (Aadhaar card), పట్టా పాస్బుక్ జిరాక్స్ తీసుకుని సెంటర్కు వెళ్లాలన్నారు. అవసరమైన కౌంటర్ల వద్ద షామియానాను ఏర్పాటు చేసి, తాగునీటి వసతిని కల్పించి యూరియా విక్రయించాలని వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ కో–ఆపరేటివ్ అధికారులను ఆదేశించారు.
Collector Kamareddy | అధికారులు పర్యవేక్షించాలి..
యూరియా (Urea) అమ్మకాల సందర్భంగా విధిగా అన్ని సెంటర్లను సందర్శించాలని వివిధ శాఖల ప్రత్యేక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. యూరియా పక్కదారి పట్టకుండా మండల స్థాయిలో తహశీల్దార్, ఎస్సై, ఎంఏవోలతో విజిలెన్స్ టీంలను ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. యూరియాకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే రాష్ట్ర టోల్ ఫ్రీ నెంబర్ 18005995779, జిల్లాస్థాయి టోల్ ఫ్రీ నెంబర్ 8977746047ను అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో 39,645 మెట్రిక్ టన్నులు యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 24,812 మెట్రిక్ టన్నులు వచ్చిందన్నారు. 16,745 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయడం జరిగిందని, 14,833 మెట్రిక్ టన్నులు యూరియా ఇంకా అవసరం ఉందన్నారు.