Homeజిల్లాలుకామారెడ్డిSC Reservation | 66 ఏళ్లుగా నో ఎస్సీ రిజర్వేషన్.. నర్సన్నపల్లికి మళ్లీ నిరాశే..

SC Reservation | 66 ఏళ్లుగా నో ఎస్సీ రిజర్వేషన్.. నర్సన్నపల్లికి మళ్లీ నిరాశే..

అక్షరటుడే, కామారెడ్డి: SC Reservation | జనాభా లేని చోట రిజర్వేషన్ వచ్చిన దాఖలాలు ఇటీవల చూస్తున్నాం. అయితే ఆ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (local body elections) సంబంధించి రిజర్వేషన్​కు సరిపడా జనాభా ఉన్నా ఆ సామాజిక వర్గం రిజర్వేషన్​కు నోచుకోవడం లేదు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి (Narsannapally) గ్రామంలో ఈ పరిస్థితి కొన్నేళ్లుగా సాగుతోంది.

1959లో ఆ గ్రామం పంచాయితీగా ఏర్పడింది. ప్రస్తుతం ఆ గ్రామంలో 1400 జనాభా ఉంది. ఇందులో కాస్త అటు ఇటుగా ఎస్సిలు 220, ముదిరాజ్ 400, మున్నూరు కాపు 350, ఒడ్డెర 150, రెడ్డి 150, చాకలి 20, ఎరుకల 08, మేర (దర్జి) 09, గోల్డ్ స్మిత్ 10, ఇతరులు 50 ఇలా మొత్తంగా 1400 ఓటర్లు ఉంటారు.

ఈ లెక్కన చూస్తే ఒక్కసారైనా ఎస్సీ రిజర్వేషన్ రావాల్సి ఉన్నా రాలేదని ఆ సామాజిక వర్గం ప్రజలు చెప్తున్నారు. పంచాయతీ ఏర్పడిన 66 ఏళ్లలో దాదాపు ఇప్పటివరకు 10-12 పాలకవర్గాలు ఏర్పడ్డాయి. 2014లో ఎస్టీ సామాజిక వర్గం ఒకే ఒకరు ఉన్నప్పుడు ఎస్టీ రిజర్వేషన్ వచ్చినట్టుగా సమాచారం. కనీసం ఈసారైనా రిజర్వేషన్ వస్తే తమకు గౌరవం లభించేదని, ఒక్కసారైనా పదవి చేపట్టిన వాళ్లం అయ్యేవారమని వాపోతున్నారు. ప్రభుత్వాలు ఇకనైనా దృష్టి సారించి ఒక్కసారైనా తమకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు.