అక్షరటుడే, ఇందూరు: Sardar Vallabhbhai Patel | నిజాం మెడలు వంచిన వల్లభాయ్ పటేల్‌ను ఎప్పటికీ మరువలేమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ (Mla Dhanpal) సూర్యనారాయణ గుప్తా అన్నారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ విమోచన ఛాయా చిత్ర ప్రదర్శనను బుధవారం వీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ పోరాట యోధుల చరిత్రను గత ప్రభుత్వాలు చెరిపేసే కుట్ర చేశాయన్నారు. నిజాం నిరంకుశ పాలనకు, బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి రాంజీ గోండు, దొడ్డి కొమరయ్య, షోయబుల్లాఖాన్, చాకలి ఐలమ్మ లాంటి వీరులు, వీర వనితల చరిత్ర భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
నిజాం దాష్టీకత్వానికి, రజాకరుల హింసాకాండకు నిలువెత్తు రూపాలుగా ఉన్న నిర్మల్ (Nirmal) జిల్లా వెయ్యి ఊడలమర్రి, బైరాన్ పల్లి ఘటనల చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. వల్లభాయ్ పటేల్ లేకపోతే నిజాం హైదరాబాద్ (Hyderabad) సంస్థానాన్ని మరో పాకిస్తాన్‌గా (Pakistan) మార్చేవాడన్నారు.
క్రూరమైన నిజాం ఆనవాళ్లను తుడిచేయాలన్నారు. నిజాం, కరీం, సికిందర్ ఎవరని.. నిజామాబాద్‌ను ఇందూరుగా మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ (Central Bureau Communication) సమన్వయకర్త ధర్మానాయక్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంమోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రంగరత్నం, పీఆర్వో డాక్టర్ దండు స్వామి, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.