Homeజిల్లాలుకామారెడ్డిBC Reservation | బీసీలు రాజకీయంగా ఎదగడం ఏ పార్టీకి ఇష్టం లేదు: బీసీ రిజర్వేషన్...

BC Reservation | బీసీలు రాజకీయంగా ఎదగడం ఏ పార్టీకి ఇష్టం లేదు: బీసీ రిజర్వేషన్ సాధన సమితి

బీసీలు రాజకీయంగా ఎదగడం ఏ పార్టీకి ఇష్టం లేదని 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : BC Reservation | బీసీలు రాజకీయంగా ఎదగడం ఏ పార్టీకి ఇష్టం లేదని 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. పలు కులసంఘాల ప్రతినిధులతో పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్ హౌస్​లో (R&B Guest House) మంగళవారం బీసీ ఆక్రోశ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు.

సభ విజయవంతం కోసం ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఛైర్మన్​గా మార్కంటి భూమన్న, వైస్ ఛైర్మన్లుగా క్యాతం సిద్దిరాములు, విఠల్ ముదిరాజ్, బాలార్జున్ గౌడ్​లు ఎన్నిక కాగా.. 30 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. అనంతరం బీసీ ఆక్రోశ సభ పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ (BC Reservation) సాధన కోసం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, బీసీ పొలిటికల్ ఫ్రంట్, జస్టిస్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో రిజర్వేషన్ సాధన సమితి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అక్టోబర్ 24న హైదరాబాద్ ఇందిరాపార్క్​ వద్ద సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ బయట కామారెడ్డిలో (Kamareddy) మొట్టమొదటి బీసీ ఆక్రోశ సభ ఈనెల 15న పట్టణంలోని సత్య కన్వెన్షన్ హాలులో నిర్వహించనున్నామని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ అడ్డుకునేదెవరు..? బీసీలకు శత్రువులెవరు? అనేది తెలుసుకోవడానికి ప్రజలు ఈ సభకు తరలిరావాలని కోరారు. 2023 నవంబర్ 10న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ (BC Declaration) ప్రకటించారని, అందులో 21 హామిలిచ్చారన్నారు. 21 హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదని తెలిపారు. 15న నిర్వహించే సభతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెన్నులో వణుకు పుట్టాలన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో 42 శాతం రిజర్వేషన్​ను 9వ షెడ్యూల్​లో చేర్చేలా పార్లమెంటులో చర్చించాలని, సభలో బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.

BC Reservation | పాలకవర్గాల మెడలు వంచేందుకే ఆక్రోశ సభ: విశారధన్ మహరాజ్

కేంద్ర, రాష్ట్ర పాలకవర్గాల మెడలు వంచేందుకే 10వేల మందితో బీసీ ఆక్రోశ సభ నిర్వహిస్తున్నామని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కన్వీనర్ విశారదన్ మహరాజ్ అన్నారు. బీసీ డిక్లరేషన్ పేరుతో రాష్ట్రంలోని రెండున్నర కోట్ల బీసీలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మోసం చేశారని ఆరోపించారు. బీసీలను చిన్నచూపు చూస్తూ.. కోర్టుల ముందు అభాసుపాలు చేసేలా చట్టాలు చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఎంత భద్రత ఉందో బీసీలకు అంతే భద్రత ఉండాలన్నారు. దేశంలో 70 కోట్ల మంది బీసీలను ప్రధాని మోదీ, రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది బీసీలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తుంటే కేసీఆర్ (KCR) మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

వీళ్లకు రాజ్యం అప్పగించేందుకు కోట్ల మంది బలికావాలా..? తమ హక్కుల కోసం ఉద్యమం చేయాల్సి రావడం న్యాయమేనా అని నిలదీశారు. బీసీలకు జ్ఞానోదయం అయిందని, అగ్రకులాల పల్లకీ మోయకుండా మన ప్రజలు ప్రభువులుగా మార్చే ఉద్యమం మొదలైందన్నారు. 15న నిర్వహించే సభకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Must Read
Related News