అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Kavita Podcast | బీఆర్ఎస్‌లో (BRS) కొన్ని దెయ్యాలు ఉన్నాయని, అవే పార్టీ అధినేత కేసీఆర్‌ను (KCR) తప్పుదోవ పట్టిస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavita) పునరుద్ఘాటించారు.
దెయ్యాలు ఎవరో కచ్చితంగా బయట పెడతానని, అయితే సమయం వచ్చినప్పుడు చెబుతానని తెలిపారు. తన తండ్రికి రహస్యంగా రాసిన లేఖ (Letter) బయటకు రావడం వెనుక ఆ దెయ్యాలే ఉన్నాయని తెలిపారు. వారి వల్లే తమ కుటుంబంలో ఎవరం “సంతోషంగా” లేమని చెప్పారు. బీఆర్ఎస్‌ను సమూలంగా నిర్మూలించే కుట్ర జరుగుతోందని, ఆ కుట్రలను నాయకత్వం ఛేదించాల్సిన అవసరం ఉందన్నారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో (podcast program) కవిత కీలక విషయాలు వెల్లడించారు.
కేటీఆర్‌తో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనన్న కవిత.. పార్టీని నడిపించే స్థాయికి ఇంకా బీఆర్ఎస్‌లో ఎవరూ ఎదగలేరని చెప్పారు. తనకు పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, పార్టీ పెట్టాలనుకుంటే ఆ విషయాన్ని ఢంకా బజాయించి చెబుతానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి (Chief Minister) కావాలన్న లక్ష్యం ఉండడం సహజమేనని, పది, పదిహేనేళ్లకో తనకా అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
MLC Kavita Podcast | ఎన్నో అవమానాలు భరించా..
పదకొండేళ్లలో పార్టీలో అనేక అవమానాలు ఎదురయ్యాయని కవిత వెల్లడించారు. పార్టీ కోసం, కేసీఆర్ నాయకత్వం (KCR leadership) కోసం తాను ఇన్నాళ్లు భరించానని చెప్పారు. కానీ లేఖ బయటకు రావడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తాను మాట్లాడక తప్పడం లేదన్నారు. తాను మాట్లాడుతున్నది కూడా పార్టీ కోసమేనని, కార్యకర్తల అభిప్రాయాలనే తాను చెబుతున్నానని తెలిపారు.
కేడర్ అభిప్రాయాలకు విలువిస్తేనే పార్టీ మనుగడ కొనసాగుతుందని, కొంత మంది చెబుతున్న వాటినే పట్టుకుని కూర్చుంటే అంతిమంగా నష్టమేనన్నారు. లిక్కర్ కేసు (Liquor case) వ్యవహారంలో పార్టీ నుంచి సరైన మద్దతు రాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేసీఆర్ (KCR) దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తాను జైలుకు వెళ్లిన సమయంలో కుటుంబం మాత్రమే అండగా నిలబడిందని, పార్టీ నుంచి అనుకున్నంత మద్దతు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
MLC Kavita Podcast | కేటీఆర్‌తో దూరం వాస్తవమే..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో (KTR) కాస్త దూరం పెరిగిన మాట వాస్తవమేనని కవిత స్పష్టం చేశారు. అన్నా చెల్లెలిగా (Siblings) గతంలో చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లమని తెలిపారు. అయితే, లేఖ లీక్ అయిన తర్వాత కొంత గ్యాప్ పెరిగిన మాట నిజమేనని చెప్పారు. కేటీఆర్ నాయకత్వంలో (KTR leadership) పని చేస్తారా? అని ప్రశ్నించగా, ఆమె తనదైన శైలిలో స్పందించారు. కేసీఆర్ తప్ప తనకు మరో నాయకుడు లేరని స్పష్టం చేశారు. ఆయన తనకు రోల్ మాడల్ అని, ఆయన స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి (Politics) వచ్చానన్నారు. పార్టీలో ఇంకా నాయకత్వం వహించి స్థాయికి ఇంకా ఎవరూ ఎదగలేరని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు (Harish rao) బీజేపీలోకి చేరుతారన్న ప్రచారంపై ప్రశ్నించగా, ఆయననే అడగాలని బదులిచ్చారు.
MLC Kavita Podcast | ఎప్పుడో ఒకప్పుడు సీఎం అవుతా..
కొత్త పార్టీ (New party) పెట్టే అవకాశంపై ప్రశ్నకు కవిత తనదైన శైలిలో స్పందించారు. అయితే, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ జాగృతితో (Telangana Jagruti) పాటు బీఆర్ఎస్‌లోనూ (BRS) కీలకంగానే ఉంటానన్నారు. అసలు పార్టీ తనదేనని, పార్టీ నిర్మాణంలో తన పాత్ర ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని చెప్పారు. తనకు కూడా ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యం ఉందని చెప్పారు. రాజకీయాల్లోనే కాదు, ఎక్కడైనా ఒక లక్ష్యం ఉండాలని, అదే మనల్ని ముందుకు నడిపిస్తుందన్నారు. ఇప్పుడు కాకపోయినా ఇంకో పదేళ్లు, పదిహేనేళ్లకో ముఖ్యమంత్రి అవుతానని చెప్పారు.
MLC Kavita Podcast | కుట్రతోనే ఓడించారు..
నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో (Nizamabad Lok Sabha elections) ఓడిపోవడం వెనుక పార్టీ నేతల కుట్ర ఉందని కవిత స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఓడించారన్నారు. లోక్‌సభ కంటే కొద్దిరోజుల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేలు గెలిచారని, అది జరిగిన కొద్దిరోజులకే జరిగిన ఎంపీ ఎన్నికల్లో (MP Elections) తాను ఓడిపోయానన్నారు. కొందరు పార్టీ నేతల ఆదేశాలతోనే ఎమ్మెల్యేలు సహకరించలేదని చెప్పారు. ఈ విషయాన్ని తాను అప్పుడే కేసీఆర్‌కు చెబితే నమ్మలేదని, కానీ ఏడాదిన్నర తర్వాత ఆయన వాస్తవాలు గ్రహించారన్నారు. అందుకే తనను మళ్లీ ఎమ్మెల్సీని చేశారని చెప్పారు.
తెలంగాణ జాగృతితో (Telangana Jagruti) తాను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగానని, కానీ అధికారంలోకి వచ్చాక తనపై ఆంక్షలు మొదలయ్యాయని కవిత తెలిపారు. గత ఆరేళ్లుగా తనను నియోజకవర్గాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు యత్నించారన్నారు. లేఖ లీక్ విషయంపై తాను మాట్లాడిన తర్వాత కొందరు నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీలోని కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
MLC Kavita Podcast | అంతర్గత విషయాలు బయటకెలా వస్తున్నాయి?
పార్టీలో అంతర్గత విషయాలు అంతర్గతంగానే చర్చించాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను కవిత (Kavitha) పరోక్షంగా ఖండించారు. అంతర్గత విషయాలు బహిరంగమవుతున్నప్పుడు బయట మాట్లాడకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. అంతర్గత విషయాలు ఎలా బయటకు వస్తున్నాయో గుర్తించి, సెట్‌రైట్ చేయాలి కదా? అని అడిగారు. కేసీఆర్ (KCR) ఏం తిన్నారనే విషయం కూడా బయటకు వస్తుందని, ఎందుకిలా జరుగుతుందో పార్టీ నాయకత్వం ఆలోచించాలని సూచించారు. మనం ఎందుకు ప్రతిపక్షంలోకి వచ్చామన్నది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో సమస్యలు ఎవరి వల్ల వస్తున్నాయో గుర్తించి వారిని కంట్రోల్ చేయాల్సి ఉందన్నారు. మాట్లాడకుంటే సమస్య పరిష్కారం అవుతుందనుకోవడం సరికాదన్నారు. తనను పార్టీ ఓన్ చేసుకుందో లేదో పార్టీ నాయకత్వమే చెప్పాలన్నారు. తన తండ్రికి లేఖ రాసింది కార్యకర్తల అభిప్రాయాలేనని, అందులో తనకు ఎలాంటి ప్రయోజనాలు లేవన్నారు.
MLC Kavita Podcast | కేసీఆర్‌తో సత్సంబంధాలే..
ఫామ్‌హౌస్‌కు (Farm house) వెళ్తే కేసీఆర్ పట్టించుకోలేదని వచ్చిన వార్తలను కవిత కొట్టిపడేశారు. ఫామ్‌హౌస్‌లో పైఅంతస్తులోకి మీడియాకు ప్రవేశం లేదని, అక్కడ ఏం జరిగిందో మరీ ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. పార్టీకి చెందిన వారే అలా మీడియాలో వార్తలు (News) రాయించారన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంతో తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి తన తండ్రిని కలిశానని చెప్పారు. తండ్రి, కూతుళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు.
MLC Kavita Podcast | ట్యాపింగ్ జరిగిందంటే నమ్మను..
కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ (KCR phone tapping) చేయించారన్న ఆరోపణలను తాను నమ్మనని కవిత తెలిపారు. ఎందుకంటే కేసీఆర్ లాంటి మహా నాయకుడు ఆ స్థాయికి దిగజారి వ్యవహరించరని చెప్పారు. కేసీఆర్ బోళాశంకరుడు.. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోరని తెలిపారు. తన కూతురు, అల్లుడు, సన్నిహితుల ఫోన్లను రహస్యంగా వినేంత దురాలోచన ఆయనకు ఉండదన్నారు. కానీ, అలాంటి వార్తలు వింటే బాధేస్తుందని చెప్పారు. అయితే, వ్యవస్థలో ఎక్కడో తప్పు జరిగితే, ఆ విషయాన్ని ప్రభుత్వమే బయట పెట్టాలన్నారు.
ట్యాపింగ్ కేసు విచారణలో (tapping case investigation) తన అనుచరులు కొందరికి సిట్ నుంచి ఫోన్లు వచ్చాయని వెల్లడించారు. వారు వెళ్లి సిట్ అధికారుల ముందు హాజరయ్యారని తెలిపారు. అయితే, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా.. లేదా? అన్నది ప్రభుత్వమే బయటకు తేవాలన్న కవిత.. ఈ వ్యవహారం వెనుక మాత్రం కేసీఆర్ కచ్చితంగా ఉండరన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను (KCR family members phones) రహస్యంగా విన్నారనే వార్తలు చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయన్నారు. ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదన్నారు. ట్యాపింగ్ జరిగిందో లేదో కాలమే సమాధానం చెబుతుందన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేయాలంటే హైలెవల్ పర్మిషన్ కావాల్సి ఉంటుందని తెలిపారు. అందుకే తాను ట్యాపింగ్ విషయాన్ని నమ్మనని స్పష్టం చేశారు.