అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | యాసంగి సీజన్లో పంటల సాగుకోసం సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) పేర్కొన్నారు. యూరియా ఎరువుల పంపిణీ (urea fertilizer distribution) తీరుపై సోమవారం అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
Collector Nizamabad | సహకార సంఘాల్లో..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని సహకార సంఘాల్లో యూరియా (urea) సహా ఇతర ఎరువులు అందుబాటులో ఉంచామని, పంటసాగు చేస్తున్న ప్రతి రైతుకు అందే విధంగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో జిల్లాలో 82,055 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా.. 51091 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు.
Collector Nizamabad | 38,993 మెట్రిక్ టన్నుల పంపిణీ
అక్టోబర్ 1వ తేదీనుంచి ఇప్పటివరకు 38,993 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువు 32,057 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1,580 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 1,460 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.
Collector Nizamabad | పంపిణీ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు..
ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద షామియానాలు ఏర్పాటు చేస్తూ.. ఉదయం 6 గంటల నుంచి పంపిణీ ప్రారంభమయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే పారదర్శకంగా ఎరువుల పంపిణీ జరిగేందుకు రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి తెచ్చిందన్నారు. విక్రయ కేంద్రంలో యూరియా బుకింగ్ యాప్‌కు సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. అయితే ఒకేసారి యూరియా కొనుగోలు చేయకుండా, శాస్త్రీయ పద్ధతిలో అవసరానికి సరిపడా మాత్రమే వినియోగించాలని కలెక్టర్ రైతులను కోరారు.