అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కేసులకు భయపడబోమని పేర్కొన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్(Telangana Bhavan)లో మాట్లాడారు. లొట్టపీసు కేసులతో ముఖ్యమంత్రి చేసేదేమి లేదన్నారు. రేవంత్(CM Revanth)కు నిద్రపట్టకుండా హామీలపై ప్రశ్నిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | పాలమూరు-రంగారెడ్డిపై దుష్ప్రచారం
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టివేసిందని కేటీఆర్ తెలిపారు. సుప్రీంకోర్టు సాక్షిగా నిజాలు బయటకు వచ్చాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలో తేలిపోతుందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డిని వెంటనే పూర్తిచేసి మహబూబ్‌నగర్ ప్రజలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
KTR | గడువు ఎందుకు పొడిగించారు..
కాంగ్రెస్ పాలన కమీషన్ల మయమైందని కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే చెబుతున్నారని పేర్కొన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్(KCR)కు నోటీసులు ఇచ్చారన్నారు. జస్టిస్ గోష్ తన విచారణ పూర్తయిందని చెప్పారన్నారు. అయినా కూడా కమిషన్ గడువు మళ్లీ ఎందుకు పొడిగించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం నోటీసులు ఇప్పటి వరకు కేసీఆర్‌కు అందలేదని, అందాక ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
KTR | రైతులు చనిపోతుంటే.. అందాల పోటీలా..
రాష్ట్రంలో రైతులు(Farmers) చనిపోతుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అందాల పోటీల్లో బిజీగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. రైతుల సమస్యల మీద రివ్యూ చేయని ముఖ్యమంత్రి, అందాల పోటీల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 580 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి వడ్లు తడిసి రైతులు గోస పడుతున్నా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పే సీఎం.. రూ.200 కోట్లు అందాల పోటీలకు ఎందుకు ఖర్చు చేస్తున్నట్లు అని కేటీఆర్ ప్రశ్నించారు. మిస్ వరల్డ్ పోటీదారులకు(Miss World contestants) మంత్రులంతా టూర్ గైడ్లుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం హయాంలో చేపట్టిన నిర్మాణాలనే రేవంత్‌రెడ్డి మిస్ వరల్డ్ అభ్యర్థులకు చూపిస్తున్నారని కేటీఆర్ అన్నారు.