HomeUncategorizedBank Balance | మినిమం బ్యాలెన్స్‌పై ఇక నో వర్రీ.. అయితే ఆ బ్యాంక్‌లలో మాత్రమే..

Bank Balance | మినిమం బ్యాలెన్స్‌పై ఇక నో వర్రీ.. అయితే ఆ బ్యాంక్‌లలో మాత్రమే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Bank Balance | దేశంలోని పలు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు (Public sector banks) తమ సేవింగ్స్‌ అకౌంట్లలో కనీస సగటు బ్యాలెన్స్‌ (ఎంఏబీ) చార్జీలను తొలగించాయి. దీనిని ఆర్థిక సమ్మిళనాన్ని ప్రోత్సహించే దిశగా ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా ఆయా బ్యాంకుల కస్టమర్ల (Customers)కు అదనపు ఛార్జీల నుంచి కాస్త ఊరట లభించినట్లయ్యింది. అయితే ఎంఏబీ(MAB) విషయంలో ప్రైవేట్‌ బ్యాంకులు తమ కస్టమర్లపై భారీ భారాన్ని మోపుతున్నాయి. ఎంఏబీ తొలగించే విషయంలో అవి ఇంకా ఎలాంటి ఆలోచన చేయడం లేదని తెలుస్తోంది.

Bank Balance | ఎస్‌బీఐ బాటలో..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) ఎప్పటినుంచో ఈ చార్జీలను వసూలు చేయడం లేదు. సాధారణ సేవింగ్స్‌ అకౌంట్ల(Savings accounts)పై 2020 మార్చి నుంచే ఎంఏబీ(Monthly Average Balance) ఛార్జీలను ఎత్తేసింది. తాజాగా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం ఎస్‌బీఐ బాటపట్టాయి. కెనరా బ్యాంక్‌(Canara bank) గతనెల ఒకటో తేదీనుంచి అన్ని రకాల సేవింగ్స్‌ అకౌంట్లపై ఎంఏబీ ఛార్జీలను వసూలు చేయడం లేదు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా ఈ జాబితాలో చేరింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(PNB), సెంట్రల్‌ బ్యాంకు(Central bank)లు ఈనెల ఒకటో తేదీ నుంచి ఎంఏబీ ఛార్జీలను ఎత్తేశాయి. ఇండియన్‌ బ్యాంక్‌(Indian bank) ఈనెల ఏడో తేదీనుంచి ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల బాటలో పయనించి తమ కస్టమర్లపై భారాన్ని తగ్గించాలని నిర్ణయించుకుంది.

Bank Balance | వినియోగదారులకు లభించే ప్రయోజనాలు..

బ్యాంకులు తమ వినియోగదారులకు సంబంధించిన పొదుపు ఖాతాల(Savings accounts) నిర్వహణపై కొన్ని నిబంధనలు అమలు చేశాయి. కనీస మొత్తం నిల్వ ఉంచని ఖాతాదారులపై జరిమానాలు విధిస్తూ వస్తున్నాయి. ఎంఏబీ ప్రాంతాన్ని బట్టి, ఖాతా రకాలను బట్టి మారుతుంటుంది. గ్రామీణ ప్రాంతాలలో కనీస సగటు నిల్వ తక్కువగా ఉంటుంది. పట్టణాలలో ఒకరకంగా, మెట్రో నగరాలలో కొంచెం ఎక్కువగా ఎంఏబీ విధిస్తారు. కనీస సగటు నిల్వ కన్నా బ్యాంకు బ్యాలెన్స్‌(Balance) తగ్గితే చార్జీలతో బాదుతారు. పొరపాటునో.. అవసరార్థమో కనీస నిల్వ స్థాయి నిర్వహించకపోతే విధించే చార్జీలతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంఏబీ ఎత్తేస్తూ తమ కస్టమర్లకు ఊరటనిస్తున్నాయి.

ఎంఏబీ ఛార్జీలను తొలగడంతో కనీస బ్యాలెన్స్‌ నిర్వహణ సమస్య ఉండదు. పెనాల్టీల భయం లేకుండా కస్టమర్లు స్వేచ్ఛగా బ్యాంకింగ్‌ సేవలను ఉపయోగించుకోవచ్చు. ప్రధానంగా తక్కువ ఆదాయ వర్గాలవారికి ఇది ఊరట నిచ్చే విషయం. విద్యార్థులు, సీనియర్‌ సిటిజన్లు, చిన్న వ్యాపారులు, గ్రామీణ కస్టమర్లు లబ్ధి పొందుతారు. బ్యాంకులు తీసుకుంటున్న ఈ చర్య బ్యాంకింగ్‌ వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఇన్నాళ్లు కనీస నిల్వ లేకపోతే ఛార్జీలు చెల్లించాల్సి రావొచ్చన్న భయంతో ఖాతాలు తెరవడానికి వెనుకంజ వేసినవారు కొత్తగా ఖాతాలు తెరిచే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. ప్రైవేట్‌ బ్యాంకులు(Private banks) కూడా ఇదే బాటలో నడవాలన్న అభిప్రాయాన్ని ఆయా బ్యాంకుల కస్టమర్లు వ్యక్తం చేస్తున్నారు.

Must Read
Related News