అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మృతి చెందగా.. అంత్యక్రియల కోసం డబ్బులు లేక కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు మృతదేహంతో నివసించారు.
మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar district) చెందిన స్వామిదాస్ కుటుంబంతో కలిసి శాపూర్నగరలో నివసిస్తున్నాడు. ఆయన చిన్న కుమార్తె ఓ ఆస్పత్రిలో నర్స్‌గా పని చేసేది. అయితే స్వామిదాస్ అనారోగ్యానికి గురి కావడంతో మూడు నెలల క్రితం ఉద్యోగం మానేసింది. తండ్రికి సేవలు చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం స్వామిదాస్ ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడు. ఇంటి యజమాని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించలేదు. స్వామిదాస్ మృతదేహంతో ఇంట్లోనే మూడు రోజుల పాటు ఉన్నారు.
Hyderabad | యజమాని ఫిర్యాదుతో..
మూడు రోజులుగా స్వామిదాస్ ఇంట్లో నుంచి ఎవరు బయటకు రాలేదు. దీంతో ఇంటి యజమాని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జీడిమెట్ల పోలీసులు (Jeedimetla police) ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీంతో అసలు విషయం తెలిసింది. ఇన్‌స్పెక్టర్ గద్దం మల్లేశ్ ఆధ్వర్యంలో పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి (Gandhi Hospital) తరలించారు. అనంతరం సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ సాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి రాంగోపాల్‌పేటలోని హోమ్ ఫర్ ద్ డిసేబుల్డ్ అనే స్వచ్ఛంద సంస్థ తాత్కాలిక ఆశ్రయం కల్పించింది.
