అక్షరటుడే, బోధన్ : Local Body Elections | నామినేషన్ కేంద్రాల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామ పంచాయతీ (Grama Panchayathi)లో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు.
సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి తప్పిదాలు, పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్‌డెస్క్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) నియమ, నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నిర్ణయాలను అమలు చేయకూడదని అన్నారు.
విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వ్యయ పరిమితిని పక్కాగా లెక్కించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కొత్త బ్యాంక్ అకౌంట్ తెరిచి, ఆ అకౌంట్ ద్వారానే ఎన్నికల లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల అవసరాల నిమిత్తం కొత్త బ్యాంకు అకౌంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆయా బ్యాంకులు వెంటనే అకౌంట్ ఓపెన్ చేసేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.