HomeUncategorizedTrump Tariffs | రైతుల ప్ర‌యోజ‌నాల‌పై రాజీ లేదు.. ట్రంప్ సుంకాల‌పై దీటుగా స్పందించిన ప్ర‌ధాని

Trump Tariffs | రైతుల ప్ర‌యోజ‌నాల‌పై రాజీ లేదు.. ట్రంప్ సుంకాల‌పై దీటుగా స్పందించిన ప్ర‌ధాని

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అద‌న‌పు సుంకాల‌పై ప్ర‌ధాని మోదీ ఘాటుగా స్పందించారు. రైతుల ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఎప్పుడూ రాజీ ప‌డ‌బోమ‌ని తేల్చి చెప్పారు. రైతుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అన్నదాత‌ల విష‌యంలో దేశం ఎప్పుడూ రాజీపడదని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) గురువారం స్ప‌ష్టం చేశారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుంద‌న్న అక్క‌సుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) అదనంగా 25 శాతం సుంకాలను విధించిన ఒక రోజు తర్వాత ప్ర‌ధాని నుంచి ఈ మేర‌కు స్పంద‌న వ‌చ్చింది. ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది వేడుక‌ల్లో మోదీ ప్రసంగిస్తూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Trump Tariffs | మూల్యం చెల్లించినా స‌రే..

ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోళ్ల‌ను ప్ర‌ధాని ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. తాను మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌ని త‌న‌కు తెలుస‌ని, కానీ అది చేయ‌డానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని స్పష్టం చేశారు. “మాకు రైతుల ప్రయోజనాలే ప్రధాన ప్రాధాన్యత. రైతులు(Farmers), మత్స్యకారులు(Fishermens), పాడి రైతుల ప్రయోజనాల విష‌యంలో భార‌త్‌ ఎప్పుడూ రాజీపడదు. ఈ విష‌యంలో నేను వ్య‌క్తిగ‌తంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తెలిసినా, అందుకు నేను సిద్ధంగా ఉన్నాను” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Trump Tariffs | ట్రంప్ సుంకాల మోత‌..

రష్యా నుంచి చమురు, ఆయుధాలను కొనుగోలు చేస్తున్నందుకు గాను ట్రంప్ గత వారం భారతదేశంపై 25 శాతం సుంకాలను విధించారు, 2022లో చెలరేగిన ఉక్రెయిన్ యుద్ధానికి ఇండియా ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. ర‌ష్యా నుంచి చౌక‌గా చ‌మురు కొని బహిరంగ మార్కెట్లో అధిక ధ‌ర‌కు విక్రయించి భారీ లాభం పొందుతోందని కూడా ఆరోపించారు. ర‌ష్యా(Russia)తో స్నేహ సంబంధాల‌పై గుర్రుగా ఉన్న ట్రంప్‌.. తాజాగా బుధవారం ఇండియాపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించారు. దీనితో, అమెరికా కొన్ని మినహాయింపులు మినహా భారత ఉత్పత్తులపై మొత్తం 50 శాతం సుంకాలను విధించింది. మరిన్ని ద్వితీయ ఆంక్షలు విధించబోతున్నామని ట్రంప్ హెచ్చరించారు. “ఏమి జరుగుతుందో చూద్దాం. మీరు ఇంకా చాలా చూడబోతున్నారు. మీరు చాలా ద్వితీయ ఆంక్షలను చూడబోతున్నారు” అని ట్రంప్ బుధవారం వైట్ హౌస్(White House) వెలుపల విలేకరులతో అన్నారు.

Trump Tariffs | స్వామినాథన్ నాణెం విడుద‌ల‌..

దివంగత ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(MS Swaminathan) గౌరవార్థం ప్రధాని మోదీ గురువారం ఒక స్మారక నాణెం, స్టాంపును విడుదల చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తను ప్రశంసిస్తూ వ్యవసాయ శాస్త్రంలో స్వామినాథన్ చేసిన మార్గదర్శక కృషికి ఆయనను విస్తృతంగా ఆరాధిస్తున్నారన్నారు. “…నేడు, ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యం గురించి చర్చలు జరుగుతున్నాయి మరియు ప్రభుత్వాలు దానిని రక్షించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కానీ డాక్టర్ స్వామినాథన్ ఒక అడుగు ముందుకు వేసి బయో-హ్యాపీనెస్ అనే ఆలోచనను ఇచ్చారు. నేడు, మనం ఇక్కడ ఈ ఆలోచననే జరుపుకుంటున్నాము. జీవవైవిధ్యం యొక్క బలంతో, స్థానిక ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలమని డాక్టర్ స్వామినాథన్ చెప్పేవారు” అని మోదీ తెలిపారు.

Must Read
Related News