అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | భారీ వరదలు వచ్చినా నిజాంసాగర్ ప్రాజెక్టు పటిష్టంగా, సురక్షితంగా ఉందని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Mla Pocharam Srinivar reddy) తెలిపారు. పోచారం, ఘన్పూర్ల (Ghanpur) నుంచి భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు మంజీరలోకి వదులుతుండడంతో సోమవారం నిజాంసాగర్ ప్రాజెక్టును (Nizamsagar Project) పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో ప్రాజెక్టు ఇంజినీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ దేవుని దయ వల్ల ఈ సంవత్సరం కూడా నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిందన్నారు. వానాకాలం, యాసంగి పంటలకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందించవచ్చన్నారు.
రైతులు సాగునీటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరికల నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మంజీరలోకి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసే క్రమంలో నది పరీవాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. ఆయన వెంట ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ జంగం గంగాధర్, నార్ల సురేష్, ఎజాజ్, స్థానిక నాయకులు ఉన్నారు.