అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Municipal Counting Begins | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కౌంటింగ్ మొదలుపెట్టారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ షురూ అయ్యింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు అన్ని చోట్ల ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. దీంతో ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.
Municipal Counting Begins | కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపట్టింది. కౌంటింగ్ ప్రక్రియ సైతం సాఫీగా సాగేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 60 డివిజన్లు, 178 వార్డులలో ఎన్నికలు జరగ్గా.. నిజామాబాద్ జిల్లాలో 714 మంది, కామారెడ్డి జిల్లాలో 447 మంది ఎన్నికల బరిలో నిలిచారు.
ఫలితాలపై ఉత్కంఠ
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల ఆందోళన చెందుతున్నారు. ఇక ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది. ఏ పార్టీ ఎన్ని మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకుంటుందని చర్చ ప్రజల్లో జోరుగా సాగుతుంది. ఏ ఇద్దరుముగ్గురు కలిసినా ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. ప్రజల్లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రంలోపు అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.