అక్షరటుడే, వెబ్‌డెస్క్: land encroachment | నిజామాబాద్ జిల్లాలో కబ్జాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. పార్కు స్థలాలను కబ్జా చేసేసి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్ నగరంలో ఇలాంటి ఘటన వెలుగు చూసింది. కబ్జాదారులు సుమారు రూ. 15 కోట్ల విలువ చేసే 10వేల గజాల స్థలానికి ఎసరు పెట్టారు.
land encroachment | నగరంలోని 18వ డివిజన్లో..
నిజామాబాద్ నగరంలోని 18వ డివిజన్‌కు చెందిన ప్రజలు పార్కు స్థలం కబ్జా విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. డివిజన్ పరిధిలోని ఏకశిల బిల్డర్స్ లేఅవుట్లో సుమారు 20 ఏళ్ల క్రితం 45 ఎకరాల వెంచర్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇందులో 2.20 ఎకరాల భూమిని (రెండు ఎకరాల ఇరవై గుంటలు) పార్కు కోసం కేటాయించారు. గతంలో అక్కడ నీళ్ల ట్యాంకు, పశువుల తొట్టి, బోరు బావిని కూడా ఏర్పాటు చేశారు. అయితే, ప్రస్తుతం సదరు బిల్డర్లు ఆ పార్కు స్థలాన్ని కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
land encroachment | నిర్మాణాలు తొలగించి..
పార్కు స్థలంలోని నిర్మాణాలను బిల్డర్లు తొలగించారని స్థానికులు చెబుతున్నారు. సదరు స్థలంలో నిర్మించిన పశువుల తొట్టి, బోరు బావిని తొలగించారని.. ప్రశ్నించిన స్థానికులపై దౌర్జన్యం చేస్తున్నారని కలెక్టర్‌కు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు. పార్కు స్థలంలో అక్రమంగా చేస్తున్న ప్లాట్ల విక్రయాలను వెంటనే నిలిపివేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఏకశిల బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ పరిశీలించి ప్రజలకు కేటాయించిన పార్కు స్థలాన్ని కాపాడాలని కోరారు.
కాగా.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ రియల్టర్, బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తి, టీఎన్జీవోస్లో గతంలో కీలకంగా వ్యవహిరించిన ఓ నేత ఈ కబ్జా వెనుక ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా కబ్జాదారులకు స్థానిక ఎమ్మెల్యే సైతం అండదండలు అందిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.