అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Municipal Polling | మున్సిపల్ ఎన్నికలపోలింగ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకే ఓటింగ్ ప్రారంభం అయ్యింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Nizamabad Municipal Polling | నిజామాబాద్ జిల్లాలో..
పోలింగ్‌కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలకు కలిపి 146 వార్డులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 729 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 4,95,485 ఓటర్లు ఉండగా 714 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కార్పొరేషన్లో 350 అభ్యర్థులు, భీమ్‌గల్‌లో 49, బోధన్‌లో 162, ఆర్మూర్‌లో 153 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
విధుల్లో 4వేల మందికి పైగా సిబ్బంది
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 66 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. అలాగే ఏఆర్వోలు 66 మంది, ప్రిసైడింగ్ ఆఫీసర్లు 875 మంది విధుల్లో పాల్గొననున్నారు. అంతేకాకుండా ఏపీవోలు 875 మంది, ఓపీవోలు 2,625 మందిని నియమించారు. మొత్తంగా 4,375 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో 1,398 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. కామారెడ్డి మున్సిపా లిటీలో 883 మంది, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 142, బాన్సువాడ మున్సిపాలిటీలో 229 మంది, బిచ్కుంద మున్సిపాలిటీలో 144 మంది సిబ్బందిని నియమించారు. కామారెడ్డిలో 17 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, బాన్సువాడకు ఏడుగురు, బిచ్కుంద, ఎల్లారెడ్డిలకు నలుగురు చొప్పున నియమించారు. జిల్లాలోని 239 పోలింగ్ కేంద్రాలలో సమస్యాత్మకమైన 21 పోలింగ్ కేంద్రాలు, అత్యంత సమస్యాత్మకమైన 68 పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.
నాలుగు మున్సిపాలిటీల్లో..
కామారెడ్డి జిల్లాలో 239 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 152, ఎల్లారెడ్డిలో 24, బాన్సువాడలో 39, బిచ్కుందలో 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 1,49,525 మంది ఓటర్లు ఉండగా.. అందులో 77,005 మంది మహిళలు, 72,491 మంది పురుషులు, 29 మంది ఇతరులు ఉన్నారు.