అక్షరటుడే, ఇందూరు, ఆర్మూర్: Nizamabad moneylenders : ఎవరి వద్ద చూసినా వందల సంఖ్యలో చెక్కులు.. రూ.కోట్లలో వీటి విలువ.. కేవలం చెక్కులే ఇలా ఉంటే.. వారి సంపాదన ఊహకందనంత.. వడ్డీ వ్యాపారుల వ్యాపారానికి నిజామాబాద్ జిల్లా(Nizamabad district)లో అంతే లేకుండా పోతోంది.
అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు రాయించుకుని అధిక వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. అమాయకుల నడ్డి విరుస్తున్నారు.
కొందరైతే లాయర్లను అడ్డు పెట్టుకుని సామాన్యులను భయపెడుతూ ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నారు వడ్డీ వ్యాపారులు. తాజాగా శనివారం (ఆగస్టు 23) నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో దిమ్మ తిరిగే విషయాలు వెలుగుచూశాయి.
చేపట్టిన తనిఖీలు తక్కువే అయినా భారీ మొత్తంలో ప్రామిసరీ నోట్లు, చెక్లు లభించాయి. వీటి విలువే రూ. కోట్లలో ఉండటం గమనార్హం.
అక్రమ వడ్డీ, అధిక వడ్డీ వ్యాపారాలపై శనివారం పోలీసులు మెరుపు దాడులు చేపట్టారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Nizamabad Police Commissioner Sai Chaitanya) ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు.
Nizamabad moneylenders : కఠిన చర్యలు..
ఎలాంటి అనుమతులు లేకుండా, రిజిస్ట్రేషన్ సైతం లేకుండా అనేకమంది (moneylenders) అక్రమంగా ఫైనాన్స్ నిర్వహిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు దాడులు చేపట్టినట్లు సీపీ సాయి చైతన్య ఈ సందర్భంగా తెలిపారు. సామన్య, పేద కుటుంబాలకు చెందిన వారి అవసరాలను ఆసరాగా చేసుకొని.. ఫైనాన్స్ పేరుతో వారి వద్ద నుంచి అధిక వడ్డీలు పసూలు చేస్తూ ఆర్థికంగా మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠినచర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
Nizamabad moneylenders : రూ.కోట్ల విలువైన పత్రాలు..
జిల్లావ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో రూ. కోట్ల విలువైన చెక్కులు లభించాయి. నగరం, పట్టణాల వారీగా పరిశీలిస్తే..
నిజామాబాదులో..
- చెక్కులు Cheques : 137, వీటి విలువ రూ. 10,14,11,370/-
- ప్రామిసరీ నోట్లు Promissory notes : 170, విలువ 7,10,73,870/-
- ల్యాండ్ డాక్యుమెంట్స్ Land documents : 99
- నగదు Cash: రూ. 1,21,92,750/-
ఆర్మూర్లో..
- చెక్కులు Cheques : 62, వాటి విలువ రూ. 30,36,000/-
- ప్రామిసరీ నోట్లు Promissory notes : 324, విలువ రూ. 4,97,10,000/-
- బాండ్ పేపర్స్ Bond papers : 49, విలువ రూ. 1,85,30,500 /-
- ల్యాండ్ డాక్యుమెంట్స్ Land documents : 5
ఏడుగురు వడ్డీ వ్యాపారులపై కేసు నమోదు..
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు వడ్డీ వ్యాపారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్మూర్ పట్టణం, మండలంలోని సుర్బిర్యాల్ గ్రామంలో వడ్డీ వ్యాపారులు లైసెన్స్ లేకుండా ప్రజల వద్ద నుంచి వస్తువులు తాకట్టు పెట్టుకోవడం, ప్రాంసరీ నోట్లు, చెక్కులపై సంతకాలు చేయించుకున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ తెలిపారు.
ఏడుగురు వడ్డీ వ్యాపారులపై కేసు నమోదు చేసి, వారి వద్ద నుంచి రూ. 13,97, 600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. తనిఖీల్లో సుమారు రూ. 7 కోట్ల విలువ గల ప్రాంసరీ నోట్లు, చెక్కులు, బాండ్ పేపర్లను గుర్తించినట్లు వివరించారు.