అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nizamabad Mayor Election | నిజామాబాద్ నగర పాలక సంస్థలో కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది.నిజామాబాద్ మేయర్ (Nizamabad Mayor) పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నించాయి.
బీజేపీ నుంచి ఎంపీ అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ జిల్లా వాసి కావడంతో కార్పొరేషన్‌ను హస్తగతం చేసుకోవడానికి తీవ్రంగా ప్రచారం చేసింది. ఈ మేరకు కౌంటింగ్ సైతం ఉత్కంఠగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పలు స్థానాల్లో గెలుపొందగా.. మరికొన్ని చోట్ల అధిక్యంలో కొనసాగుతున్నాయి. ఎంఐఎం సైతం కొన్ని వార్డుల్లో లీడ్‌లో ఉంది. దీంతో తుది ఫలితం తేలే వరకు మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో చెప్పడం కష్టంగా మారింది.
Nizamabad Mayor Election | లీడ్‌లో స్రవంతిరెడ్డి
మొదటి రౌండ్లో 6వ డివిజన్, 19వ డివిజన్ లో బీజేపీ అభ్యర్థుల లీడ్‌లో ఉన్నారు. బీజేపీ మేయర్ అభ్యర్థి స్రవంతి రెడ్డి (Sravanthi Reddy) సైతం ఆధిక్యంగా ఉండగా.. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి అని ప్రచారంలో ఉన్న శమంత నరేందర్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. 1, 2, 4, 6, 10, 19, 25, 26, 45 డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 44వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి బట్టు రాఘవేందర్ విజయం సాధించారు. రెండు సార్లు మేయర్ పీఠాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికల్లో వెనకబడింది.
Nizamabad Mayor Election | పీఠం ఎవరికో..
నిజామాబాద్ (Nizamabad)లో కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. 60 డివిజన్లు ఉన్నా.. నగర పాలక సంస్థలో మేయర్ పీఠం దక్కాలంటే 31 వార్డులు గెలవాలి. బీజేపీ సొంతంగా అన్ని స్థానాలు గెలిస్తే మేయర్ పీఠం కైవసం చేసుకుంటుంది. ఒకటి, రెండు తక్కువ అయితే ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తే సొంతంగా మేయర్ పదవిని దక్కించుకుంటుంది. ఏ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో ఎంఐఎం కీలక పాత్ర పోషించనుంది. ఆ పార్టీ మద్దతుతో కాంగ్రెస్ (Congress) కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది.