అక్షర టుడే, ఇందూరు: Nizamabad CP | క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) అన్నారు. కళాశాలలో అభ్యసించే సమయంలో తానూ బాక్సింగ్ ఆడానని తెలిపారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ (District Boxing Association) ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రస్థాయి ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఈ మేరకు సీపీ హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు.
తాను యూపీఎస్సీ ఇంటర్వ్యూలో తనకు బాక్సింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు రావడంతో సులువుగా ఎదుర్కొన్నానని చెప్పారు. ఐపీఎస్ కావడానికి బాక్సింగ్ కూడా ఒక కారణమని తెలిపారు. క్రీడలతో కచ్చితంగా లాభం ఉంటుందన్నారు. వ్యాయామంతో మెదడుకు పూర్తిస్థాయిలో ఆక్సిజన్ అందుతుందని పేర్కొన్నారు. ప్రధానంగా నలుగురితో ఎలా మెదగాలి, క్రమశిక్షణ అలవడుతుందన్నారు. భవిష్యత్తులో కొత్వాల్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు.
Nizamabad CP | సౌత్‌లో చదువులకే ప్రాధాన్యం
దక్షిణ భారత దేశంలో ఎక్కువగా చదువులకు ప్రాధాన్యమిస్తారని.. కానీ ఉత్తర భారత్లో క్రీడలకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుందని అర్జున అవార్డు గ్రహీత హుస్సాముద్దీన్ చెప్పారు. అందుకే క్రీడల్లో నార్త్ వాళ్లదే పైచేయిగా ఉందన్నారు. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రవీందర్, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంసముద్దీన్, రిటైర్డ్ ఎస్పీ మన్మోహన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్, తదితరులు పాల్గొన్నారు.