అక్షరటుడే, ఆర్మూర్: Nizamabad Collector | ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) పేర్కొన్నారు. మాక్లూర్ (Makloor) మండల కేంద్రంలో మంగళవారం పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), అంగన్వాడీ సెంటర్, ఎంఈవో కార్యాలయం, వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్, శాఖా గ్రంథాలయం, సబ్ పోస్టాఫీస్ తదితర కార్యాలయాలను తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి వివరాలను తెలుసుకున్నారు.
Nizamabad Collector | పీహెచ్సీ సందర్శన
ముందుగా మాక్లూర్ పీహెచ్‌సీని కలెక్టర్ సందర్శించారు. ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్, ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డు, వ్యాక్సినేషన్ రూమ్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్‌తో పాటు, విధుల్లో ఉన్న సిబ్బంది హాజరును పరిశీలించారు. ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. రక్త పరీక్షల నిర్వహణ (Blood test administration) వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించి, పలు సూచనలు చేశారు.
ప్రభుత్వ బడులు, వసతి గృహాల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే సమయంలో పిల్లల రక్త నమూనాలను సైతం సేకరించాలని, పీహెచ్‌సీల్లో పరీక్షలు జరిపి వాటి ఫలితాల ఆధారంగా అవసరమైన విద్యార్థులకు మెరుగైన చికిత్సలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
Nizamabad Collector | సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ పీహెచ్సీ సిబ్బందికి సూచించారు. పాముకాటు మందు, ఇతర అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండాలని సూచించారు. పీహెచ్‌సీతో పాటు పాటు దీని పరిధిలోని ఆరు సబ్ సెంటర్ల ద్వారా అందించాల్సిన వైద్య సేవలు పక్కాగా ప్రజలకు అందేలా పర్యవేక్షణ జరపాలని మెడికల్ ఆఫీసర్‌కు సూచించారు. మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎమర్జెన్సీ సమయంలో వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట అధికారులు ఉన్నారు.