అక్షరటుడే, ఇందూరు: Nizamabad central jail | నిజామాబాద్ సెంట్రల్ జైలు వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ పనిచేసిన అధికారుల వ్యవహార శైలి ఇందుకు కారణమవుతోంది. గతంలో పనిచేసిన అధికారులు అక్రమ మొరం తవ్వకాలు జరిపించి రూ. కోట్లు దండుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో ఖైదీలకు సౌకర్యాలు కల్పించి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇది సరిపోదంటూ తాజాగా ఓ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా లోపల గంజాయి cannabis smuggling లభ్యంతో మరోసారి సెంట్రల్ జైలు (Nizamabad central jail) వార్తల్లోకి ఎక్కింది.
నిజామాబాద్ కేంద్ర కారాగారంలో గంజాయి గుప్పు కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉండే జైలులోకి గంజాయి, సిగరెట్లు, ఇతర నిషేధిత మత్తు పదార్ధాలు చేరడం తీవ్ర చర్చకు దారితీసింది. నిషేధిత మత్తు పదార్థాలను ఖైదీలు వినియోగించడంపైనే దృష్టి సారించిన అధికారులు.. సదరు ఖైదీలను చితకబాదారు. కానీ, గట్టి నిఘా ఉన్న నిజామాబాద్ సెంట్రల్ జైలులోకి మత్తు పదార్థాలు ఎలా వచ్చాయనే దానిపై విచారణ చేపట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Nizamabad central jail | ఎముకలు విరగ్గొట్టారు..
కట్టుదిట్టమైన నిఘా ఉన్న జైల్లోకి నిషేధిత మత్తు పదార్ధాలు ఎలా వచ్చాయనేది విచారించాల్సింది పోయి.. సదరు ఇద్దరు ఖైదీలను జైలు అధికారులు విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో ఖైదీల్లో ఒకరికి పక్కటెముకలు విరిగాయి. మరొకరికి కాలు విరగడంతో విషయం బయటకు పొక్కింది.
Nizamabad central jail | వారికి ఎక్కడివి..
గత వారం జైలులో సదరు ఇద్దరు ఖైదీలతో అధికారులు ఆవరణను పరిశుభ్రం చేయించారు. ఈ క్రమంలోనే వారికి ఒక ప్యాకెట్ దొరికిందంటున్నారు. అందులో గంజాయి, సిగరెట్లు, నిషేధిత మత్తు పదార్ధాలు ఉన్నట్లు తెలిసింది. కాగా, వాటిని సదరు ఇద్దరు ఖైదీలు వినియోగించినట్లు సమాచారం.
అయితే రెండు రోజుల తర్వాత విషయాన్ని గుర్తించిన జైలు అధికారులు.. సదరు ఖైదీలను తీవ్రంగా కొట్టారు. మానవత్వం మరచి ఉతికి ఆరేయడంతో ఒకరికి పక్కటెముకలు, మరో ఖైదీకి కాలు విరిగింది.
కేసు విచారణ సందర్భంగా బాధిత ఖైదీలను కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో న్యాయమూర్తి గుర్తించి ఆరా తీశారు. దీంతో జైలు అధికారులు తీవ్రంగా కొట్టిన విషయాన్ని వివరించారు. దీంతో వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశించారు. కాగా, తిరిగి అదే జైలుకు పంపితే అధికారులు పగబడతారని ఖైదీలు మొరపెట్టుకోవడంతో న్యాయమూర్తి సూచన మేరకు వేరే జైలుకు తరలించారు.
ఇంతకూ గంజాయి ఎక్కడిది..
నిజామాబాద్ జైలు అధికారులపై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వీరు డబ్బులు తీసుకుని ఖైదీలకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గంజాయి కూడా సమకూర్చినట్లు ప్రచారం జరుగుతోంది. జైలు అధికారులకు తెలిసే గంజాయి లోపలకు వచ్చిందా.. వారే సమకూర్చారా.. లేక నిఘా కన్నుగప్పి ఖైదీలే లోపలకు తెప్పించుకున్నారా.. ఈ క్రమంలో వీరికి జైలు సిబ్బంది ఎవరైనా సహకరించారా.. అనే విషయలు తెలియాల్సి ఉంది.