అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad bypass road | నిజామాబాద్ బైపాస్ రోడ్డులో మామూలు, మధ్యతరగతి ప్రజలు భూములు కొనే పరిస్థితి లేదు. సంపన్నులు, ఎగువ మధ్యతరగతి వారు, ప్రత్యేకించి ఓ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే భూములు కొనుగోలు చేసేలా పరిస్థితి తయారైంది. అలా భూముల ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఏమై ఉన్నప్పటికీ ఇక్కడ వెలిసిన వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నిబంధనలు తుంగలో తొక్కినట్లు తెలుస్తోంది.
ప్రత్యేకించి ఓ సామాజిక వర్గానికి చెందిన రియల్టర్లు, బడా బిల్డర్లు ఈ ప్రాంతాన్ని తమకు అడ్డగా మార్చుకుని ఉన్నఫలంగా మార్కెట్‌ను రెండింతలు పెంచేశారు. నిబంధనలు పక్కనబెట్టి డూప్లెక్స్ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా.. వెంచర్లు కూడా నెలకొల్పారు. అసైన్డ్ భూములు, ఇనామ్ భూములను సైతం దర్జాగా వెంచర్లుగా మార్చి అమ్మకాలు చేపడుతున్నారు.
Nizamabad bypass road | ఆయన హయాంలోనే..
నిజామాబాద్ జిల్లాలో గతంలో పనిచేసి బదిలీపై వెళ్లిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి హయాంలోనే బైపాస్ రోడ్డులోని నిషేధిత భూములకు అనుమతులు జారీ అయినట్లు తెలుస్తోంది. సదరు ఐఏఎస్‌తో సత్సంబంధాలు కలిగిన ఒకరిద్దరు రియల్టర్లు , రెవెన్యూ అధికారులు అడ్డగోలుగా అనుమతులు జారీ చేయించినట్లు తెలుస్తోంది.
రాత్రికి రాత్రే రికార్డులను మార్చేసి పట్టా భూములుగా చూపించారని తెలిసింది. ఆ వెంటనే సదరు ఐఏఎస్ అండదండలతో టెంపరరీ లేఅవుట్ అనుమతులు సైతం మంజూరు చేయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బైపాస్ రోడ్డులోని లహరి హోటల్ ఎదురుగా ఉన్న ఓ వెంచర్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తెలుస్తోంది.
ఎలాంటి ఎన్వోసీ, ఓఆర్సీలు లేకపోయినప్పటికీ ఇనామ్ భూముల్లో దర్జాగా రోడ్లు వేశారు. అలాగే రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత వెలిసిన మరో వెంచర్‌లోనూ కెనాల్ భూములను ఆక్రమించినట్లు సమాచారం. వాస్తవానికి నోటిఫైడ్ కెనాల్ ఉన్నచోట తొమ్మిది మీటర్ల మేర బఫర్‌జోన్ కింద స్థలాన్ని వదలాలి. ఆ తర్వాత రోడ్డు కోసం మరో 30 ఫీట్ల స్థలాన్ని కూడా వదలాలి. కానీ, సదరు గేటెడ్ కమ్యూనిటీలో ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కినట్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే స్పష్టం అవుతోంది.