అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad bypass land scam | నిజామాబాద్ Nizamabad నగర శివారులోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో భూములకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధాన రహదారి వెంబడి ఉన్న భూములు గజం రూ. లక్ష వరకు పలుకుతున్నాయి. అయితే, బైపాస్ రోడ్డులో భూముల ధరలు పెరగడానికి కారణాలు అనేకం.
బైపాస్ bypass లో భూములకు ఉన్న డిమాండ్‌ను ముందే పసిగట్టిన కొందరు బడా రియల్టర్లు ఏకంగా అసైన్డ్ భూములను ముందుగానే తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని దొడ్డిదారిలో పట్టా భూములుగా మార్చుకున్నారు. బైపాస్ రోడ్డులో ఉన్న ఓ ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో గల నాలుగు ఎకరాల సర్కారీ, కేకే (ఖరీజ్ ఖాతా), ఇనామ్ భూములకు సంబంధించి పట్టా సృష్టించడం, ఏకంగా నాలా కన్వెర్షన్ కూడా జరిగిపోవడం తీవ్ర చర్చకు దారితీసింది.
Nizamabad bypass land scam | నిబంధనలు తుంగలో తొక్కి..
వాస్తవానికి సదరు సర్వే నంబరుకు సంబంధించి ఐదు ఎకరాల పైచిలుకు భూమి ఉంది. ఈ మొత్తం భూమి కూడా సర్కారీ, కేకే, ఇనామ్ ల్యాండ్ కావడంతో నిషేధిత జాబితాలో కొనసాగుతూ వస్తోంది. కాగా, 2021 అక్టోబరులో సదరు భూమికి సంబంధించిన నాలుగు ఎకరాల భూమికి పట్టాగా క్లాసిఫికేషన్ మార్చడం తీవ్ర చర్చకు దారితీసింది.
అప్పట్లో జిల్లాలో పనిచేసిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ ఐఏఎస్ అధికారి ఈ మొత్తం వ్యవహారాన్ని అన్నీ తానై ముందుండి నడిపించాడు. తహసీల్దారు కార్యాలయం మొదలుకుని ఆర్డీవో, ల్యాండ్ సర్వే రికార్డు ఆఫీసు వరకు క్లాసిఫికేషన్ మార్చడంలో సదరు అధికారి దగ్గరుండి పనులు చక్కబెట్టినట్లు తెలుస్తోంది.
ప్రత్యేకించి ఈ సర్వే నంబరుకు సంబంధించి క్లాసిఫికేషన్ రికార్డులు ఏవీ అందుబాటులో లేవు. సేత్వార్ , కాస్రా పహాణీ, వసూలు బాకీ, పైసల్ పట్టి తదితర రికార్డులు ఏవీ లేకపోయినప్పటికీ.. దీనిని పరిగణనలోకి తీసుకోకుండా సదరు సర్కారు భూమిని పట్టాగా మార్చుతూ అప్పటి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
వాస్తవానికి భూమి తాలుకా క్లాసిఫికేషన్ మార్పు చేయాలంటే.. సేత్వార్ / కాస్రా అనేది అత్యంత ప్రామాణికం. వీటి ఆధారంగానే భూమి పట్టా.. లేక సర్కారుకు చెందినదిగా.. లేక అసైన్డ్ భూమినా.. అనేది తెలుస్తుంది. ఇందుకోసం జిల్లాస్థాయిలో ఉండే ల్యాండ్ సర్వే రికార్డు కార్యాలయంలో పున:పరిశీలన చేయించడం తప్పనిసరి. ఒకవేళ అక్కడ రికార్డులు లేకపోతే.. రాష్ట్రస్థాయిలో ల్యాండ్ సర్వే రికార్డు లేదా.. సీసీఎల్ఏ నుంచి క్లారిఫికేషన్ తీసుకోవడం తప్పనిసరి. కానీ, ఈ భూమి తాలుకా క్లాసిఫికేషన్ మార్పిడి విషయంలో అధికారులు నిబంధనలను తుంగలో తొక్కినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా కేవలం మ్యానువల్ పహాణీలో ఒకటికి రెండుస్లారు చెర్ల పట్టాగా వచ్చిందనే కారణాన్ని సాకుగా చూపి పట్టాగా మార్చేయడం గమనార్హం. మరోవైపు సదరు ఫైలు రెవెన్యూ కార్యాలయంలో చకచకా మూమెంట్ జరగడం, కేవలం నాలుగైదు రోజుల్లోనే పట్టాగా మార్పు చెందడం, ఆ వెంటనే కలెక్టర్ ఉత్తర్వులు వెలువడటం వెనుక పెద్ద తతంగమే జరిగినట్లు స్పష్టం అవుతోంది.
Nizamabad bypass land scam | అన్నీ ఉల్లంఘనలు..
తెలంగాణ రెవెన్యూ చట్టాన్ని అనుసరించి జిల్లా, మండల కేంద్రాలకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అసైన్డ్, ప్రభుత్వ, కరీజ్ ఖాతా ల్యాండ్లకు సంబంధించి క్లాసిఫికేషన్ మార్చడానికి వీల్లేదు. ప్రభుత్వ అవసరాలు, సర్కారు కార్యాలయాలు, ఇన్స్టిట్యూషన్ భవనాలు నిర్మించేందుకు వీలుగా ఈ నిబంధన అమల్లో ఉంచారు. కాగా, ప్రస్తుతం బైపాస్ రోడ్డులో క్లాసిఫికేషన్ మార్చిన భూమి జిల్లా కేంద్రంలో(నగరంలనే) నే ఉండటం గమనార్హం.
పైగా, ఇక్కడ గజం భూమి ధర రూ. 30 వేలకు పైగా పలుకుతోంది. ఇలాంటి భూమిని నిబంధనలు పక్కనబెట్టి గత భారాస హయాంలో దొడ్డిదారిలో పట్టాగా మార్చిన మహనీయులు ఎవరనేది ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పెద్దలు, అధికారులు బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, ఆ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు కూడా సదరు అక్రమార్కులతో కలిసిపోవడంపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి.