అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh Reddy | నిజాంసాగర్ కెనాల్ ఆధునీకరణకు రూ.1,500 కోట్లు కేటాయించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో (assembly sessions) భాగంగా శనివారం ఆయన ప్రసంగించారు.
Mla Rakesh Reddy | నిజాంసాగర్ ఆధునీకరణకు..
నిజాంసాగర్ (Nizam Sagar) ఆధునీకరణకు సంబంధించిన రూ.7వేల కోట్లు చెల్లించాలని, రెండేళ్ల క్రితం మోటార్లు కాలిపోయినప్పటికీ వాటి స్థానంలో నూతన మోటార్లు ఏర్పాటు చేయలేదని రాకేష్ రెడ్డి కోరారు. గత రెండేళ్లుగా నీటిపారుదల శాఖ మంత్రిని తాను 20 సార్లు కలిసినప్పటికీ నవ్వి వదిలేశారన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం నిజాంలు నిర్మించిన నిజాంసాగర్ కాలువ పూడికతో నిండిపోయి అధ్వానంగా మారిందన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలోనూ..
ఉమ్మడి రాష్ట్రంతో పాటు ప్రత్యేక రాష్ట్రంలోనూ నష్టపోయిన జిల్లా ఏదైనా ఉందంటే అది నిజామాబాద్ జిల్లానేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లా నిజామాబాద్ అని సీఎం, మంత్రులు తమ జిల్లాపై దయ చూపించాలన్నారు. మదనపల్లి నుంచి ఆర్మూర్ మండలం ఫత్తేపూర్ వరకు నిజాంసాగర్ కెనాలను పునరుద్ధరించాలని ఇందుకు రూ.1500 కోట్లు కేటాయించాలని ఆయన కోరారు.
ఇందిరమ్మ స్కీంపై..
అదేవిధంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులందరికీ న్యాయం చేయాలని రాకేస్ రెడ్డి కోరారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ఇందిరమ్మ స్కీంను అమలు చేయాలన్నారు. కొన్ని గ్రామాల్లో గతంలో ప్లాట్లు ఇచ్చి ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదని.. వారికి పట్టాలు ఇచ్చి ఆ స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.