అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CBI Trap | లంచం తీసుకుంటూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (National Highways Authority of India) (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్టు డైరెక్టర్ సీబీఐకి చిక్కారు. జాతీయ రహదారి పక్కనున్న రెస్టారెంట్ కార్యకలాపాలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ఉండేందుకు లంచం (bribe) డిమాండ్ చేయగా, బాధితుడు సీబీఐని ఆశ్రయించారు. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ (central investigation agency) వలపన్ని అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
బీబీనగర్‌లోని హైదరాబాద్ – వరంగల్ హైవే (Hyderabad-Warangal Highway), గూడూరు టోల్ ప్లాజా సమీపంలోని హైవే పక్కన ఓ వ్యక్తికి రెస్టారెంట్ నడిపిస్తున్నాడు. అయితే, రెస్టారెంట్ నిర్వహణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు చెందిన వరంగల్ ప్రాంత ప్రాజెక్ట్ డైరెక్టర్ తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, రెస్టారెంట్ నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉండడానికి రూ. లక్ష లంచం ఇవ్వాలని పీడీ.. సదరు ఓనర్‌ను డిమాండ్ చేశారు. తాను పీడీగా ఉన్నంత కాలం ఎలాంటి ఇబ్బందులు ఉండదని తెలిపాడు.
ఇరువురి మధ్య చర్చల అనంతరం చివరకు రూ.60వేలకు ఒప్పందం కుదిరింది. అయితే, బాధితుడు సీబీఐని (CBI) ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. బాధితుడు మంగళవారం సదరు అధికారికి చెందిన ప్రైవేట్ వ్యక్తికి డబ్బు ఇస్తుండగా వల పన్ని పట్టుకుంది. ప్రాజెక్టు డైరెక్టర్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తిని సీబీఐ అరెస్టు చేసింది. హైదరాబాద్, వరంగల్, సదాశివపేటలలో నిందితుడికి సంబంధించిన మూడు చోట్ల సోదాలు నిర్వహించి, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని సీబీఐ అధికారులు తెలిపారు.