అక్షరటుడే, వెబ్డెస్క్ : Bhuvanagiri | రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి చెందారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి రైల్వేస్టేషన్ (Vangapalli railway station) సమీపంలో చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా (Parvathipuram Manyam district) గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన సింహాచలం(25)కు, అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని(19)కి వివాహం జరిగింది. రెండ నెలల క్రితం వివాహం కాగా.. దంపతులు హైదరాబాద్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. సింహాచలం ఓ రసాయన పరిశ్రమలో పని చేస్తున్నాడు. దీంతో దంపతులు జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు.
Bhuvanagiri | బంధువుల ఇంటికి వెళ్తుండగా..
విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లడానికి సింహాచలం, భవాని బయలుదేరారు. వీరు గురువారం రాత్రి సికింద్రాబాద్లో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఎక్కారు. అయితే వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత డోర్ వద్ద నిలబడ్డ ఇద్దరు దంపతులు జారి పడి చనిపోయారు. అయితే రాత్రి కావడంతో ఎవరు గమనించలేదు. శుక్రవారం ఉదయం వంగపల్లి– ఆలేరు తనిఖీలు చేస్తున్న ట్రాక్మన్ ఇద్దరి మృతదేహాలను గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా పెళ్లయిన రెండు నెలలకే దంపతులు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.