అక్షరటుడే, వెబ్‌డెస్క్: CP Sajjanar | నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పౌరులకు సూచించారు. క్యాబ్, ఆటో డ్రైవర్లు రైడ్‌కు నిరాకరించడం, బుక్ చేసిన ఛార్జ్ కంటే అధికంగా డబ్బులు డిమాండ్ చేయడం వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
CP Sajjanar | వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి
హైదరాబాద్ (Hyderabad) సిటీ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555కు కాల్ చేయాలని లేదా మెసేజ్ పంపించాలని సీపీ సూచించారు. ఫిర్యాదు చేస్తూ రైడ్ డీటెయిల్స్ స్క్రీన్‌షాట్, వాహన నంబర్, ఘటన జరిగిన సమయం, ప్రదేశం వంటి పూర్తి వివరాలు తప్పనిసరిగా పంపాలని తెలిపారు. బుధవారం (డిసెంబర్ 31) అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations) సమయంలో క్యాబ్ లేదా ఆటో రైడ్‌కు నిరాకరించినా, అధిక ఛార్జీలు వసూలు చేసినా సంబంధిత డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే మోటార్ వాహనాల చట్టం 178 (3)(b) సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకల్లో నగర ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ (Police Department) చర్యలు చేపడుతోందని సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు సీపీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా అధికారికంగా ప్రకటన చేశారు. ఫిర్యాదు చేసేటప్పుడు సదరు వాహనం నంబర్, సమయం ప్రదేశం, రైడ్ వివరాల స్క్రీన్‌షాట్ తప్పనిసరిగా పంపించాలని తెలియజేశారు. ఈ వివరాలతో వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హామీ ఇచ్చారు. పోలీస్ శాఖ ఈ నంబర్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తుందని, న్యూ ఇయర్ సమయంలో ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజల్లో భరోసా పెంచి అక్రమాలను అరికట్టడానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు.