అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cyber Crime | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నిత్యం కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఇటీవల సైబర్ నేరాలు భారీగా పెరిగాయి. ఆశపెట్టి, భయపెట్టి ప్రజల ఖాతాలను కేటుగాళ్లు కొట్టేస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు వస్తుందని, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు (stock market investments), డిజిటల్ అరెస్ట్‌ల (digital arrests)పేరిట మోసాలకు పాల్పడుతున్నాయి. అయితే ఈ నేరాలపై పోలీసులు నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. దీంతో సైబర్ దొంగలు రూటు మార్చారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల్లో లింక్‌లు పంపి ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు.
Cyber Crime | క్లిక్ చేస్తే అంతే..
“హేయ్.. మీ ఫొటో చూశారా?” అంటూ ఇటీవల వాట్సాప్‌లో లింక్‌లు సర్క్యూలేట్ అవుతున్నాయి. అయితే పొరపాటున వీటిని క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అయినట్లే. తెలిసిన వారి నుంచి ఈ మెసెజ్ వచ్చిన ఓపెన్ చేయొద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) హెచ్చరించారు. ఇదొక ‘ఘోస్ట్ పేయిరింగ్’ (GhostPairing) స్కామ్ అని ఆయన తెలిపారు. ఆ లింక్ క్లిక్ చేస్తే నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుందన్నారు. ఓటీపీ, స్కానింగ్ లేకుండానే.. ప్రజలకు తెలియకుండా వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్ అవుతుందన్నారు.
Cyber Crime | ఇతరులకు సందేశాలు పంపి
ఒక్కసారి వారి చేతికి చిక్కితే వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. కాంటాక్ట్స్ లిస్ట్ దొంగిలిస్తారు. ‘మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడతారు. చివరికి మీ ఖాతాను మీరే వాడలేకుండా లాక్ చేస్తారు’ అని పేర్కొన్నారు. అనుమానాస్పద లింక్‌లను అస్సలు క్లిక్ చేయవద్దని సూచించారు. వాట్సాప్ సెట్టింగ్స్‌లో ‘Linked Devices’ ఆప్షన్‌ను తరచూ పరిశీలించాలన్నారు. తెలియని డివైజ్‌లు ఉంటే వెంటనే రిమూవ్ చేయాలని సూచించారు. Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలన్నారు.