అక్షరటుడే, వెబ్‌డెస్క్: America : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) తిరిగి అధికారంలోకి భారత్ పట్ల కఠువుగా వ్యవహరిస్తున్నారు. వీసాల నుంచి మొదలు వాణిజ్యం వరకూ ఆంక్షలు విధిస్తున్నారు. అక్రమ వలసలు అంటూ వందలాది మంది భారతీయులను వెనక్కు పంపించిన ట్రంప్.. ఇప్పుడు మరింత మందిని వెళ్లగొట్టే పనిలో పడ్డాడు. మొదట వీసా నిబంధనలను కఠినతరం చేసిన అమెరికా.. ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారుల(H-1B visa holders)కు గడువు ముగియకముందే బహిష్కరణ నోటీసులు జారీ చేస్తోంది. ఈ పరిణామంతో అక్కడి భారతీయులు (Indians) ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అమెరికాలో హెచ్-1బీ వీసా హోల్డర్లుగా ఉన్న వారిలో భారతీయులే ఎక్కువ.
America : గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ..
సాధారణంగా అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా తమ వీసా స్టేటస్ను మార్చుకోవడానికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అయితే ఈ గడువు ముగియకముందే ఇప్పుడు వారికి నోటీసులు (నోటీస్ టు అప్పియర్) జారీ చేస్తున్నారు. అధికారిక 60 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ముగియకముందే బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఆగస్టు 6 – 8 మధ్య అనామక వర్క్ప్లేస్ యాప్ బ్లైండ్లో నిర్వహించిన సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం.. ఉద్యోగం కోల్పోయిన ఆరుగురిలో ఒకరు గ్రేస్ పీరియడ్లోపు తాము లేదా తమకు తెలిసిన వ్యక్తి నోటీసు టు అప్పియర్ (Notice to Appear – NTA) అందుకున్నట్లు తేలింది. ఈ నోటీసులు అందుకున్న తర్వాత భారత్కు తిరిగి రావడం తప్ప వేరే మార్గం లేదని చాలామంది అంటున్నారు. ఉద్యోగం పోతే వీలైనంత త్వరగా తిరిగి వెళ్లిపోవాలని అదే సమయంలో ఇమిగ్రేషన్ అధికారులు సలహా ఇస్తున్నారు. లేకుంటే శాశ్వత నిషేధానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
America : ఉద్యోగాలు కోల్పోతున్న భారతీయులు
తాజా సర్వేల ప్రకారం.. అమెరికాలో నివసిస్తున్న 45 శాతం మంది భారతీయులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో 26 శాతం మంది ఇతర దేశాలకు వలస వెళ్లాలని భావిస్తుండగా.. మిగిలిన వారు భారత్కు తిరిగి రావాలని ఆలోచిస్తున్నారు. గడువుకు ముందే నోటీసులు రావడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాను వదిలి వెళ్తే తమ జీతం, జీవనశైలి ప్రభావితం అవుతాయని, కొత్త ఉద్యోగావకాశాలు కూడా తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, తమ కుటుంబాల భవిష్యత్తు గురించి భయపడుతున్న చాలామంది భారతీయులు, అమెరికాలో తిరిగి మంచి ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడాలని ఆశిస్తున్నారు.
భారతీయులను నియమించుకోవడం నిలిపి వేయాలని ట్రంప్ ఇటీవల అమెరికా కంపెనీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇండియన్ల పరిస్థితి దుర్భరంగా మారింది. అదే సమయంలో అక్కడి కంపెనీలు కూడా డోలాయమానంలో పడ్డాయి. నిపుణుల కొరత తలెత్తే అవకాశముంటుందని పేర్కొంటున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్రరాజ్యం వెళ్లాలనుకుంటున్న భారతీయుల్లో ఆందోళన నెలకొంది.