అక్షరటుడే, వెబ్‌డెస్క్: GST | వస్తు సేవల పన్ను(GST) కొత్త శ్లాబ్ రేట్లు రేపటినుంచి(సెప్టెంబర్ 22) అమలులోకి రానున్నాయి. నూతన శ్లాబ్‌ల ప్రకారం చాలా రకాల వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. అయితే పాత స్టాక్(Old stock), కొత్త స్టాక్ వంటి అంశాలపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
పాత స్టాక్‌ను ఎలా విక్రయిస్తారన్న అంశంపై ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. కాగా జీఎస్టీ అమలు విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే ఫిర్యాదులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల కోసం హెల్ప్‌లైన్(Help line) ఏర్పాటు చేసింది. ఇందుకోసం జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌లోని ఇన్‌గ్రామ్(ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం) పోర్టల్(Portal)లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్రం ప్రకటించింది.
జీఎస్టీలో సంస్కరణల(GST reforms) కోసం ఈనెల 3వ తేదీన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ఉన్న నాలుగు శ్లాబ్‌ల విధానాన్ని తొలగించి రెండు శ్లాబ్(Slab)లకు పరిమితం చేశారు. 12, 28 శాతం శ్లాబ్‌లను రద్దు చేసిన సర్కారు.. వాటిని 5, 18 శాతం శ్లాబ్‌లలో సర్దుబాటు చేశారు.
అయితే లగ్జరీ(Luxury) వస్తువులు, హానికర ఉత్పత్తులు మాత్రం ప్రత్యేకంగా 40 శాతం శ్లాబ్‌లో ఉండనున్నాయి. కాగా లగ్జరీ వస్తువులపై ఉన్న సెస్(Cess)ను సర్కారు తొలగించింది. నూతన శ్లాబ్‌లు సోమవారంనుంచి అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ శ్లాబ్‌ల విషయంలో ప్రజలకు తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు వినియోగదారుల వ్యవహారాల విభాగం చర్యలు చేపట్టింది.
సవరించిన వస్తు సేవల పన్ను రేట్లు, మినహాయింపులు అమలు చేసిన తర్వాత ఎన్‌సీహెచ్‌పై వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు, ప్రశ్నలను పరిష్కరించేందుకు ఇన్‌గ్రామ్ పోర్టల్‌లో ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విభాగంలో వాహన, బ్యాంకింగ్, మన్నికైన వినిమయ ఉత్పత్తులు, ఎఫ్‌ఎంసీజీ(FMCG), ఇ-కామర్స్ సహా ఇతర ప్రధాన ఉప విభాగాలున్నాయి. కాగా సెప్టెంబర్ 22 తర్వాత పాత వస్తువులను సైతం తగ్గించిన ధరలతోనే విక్రయించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం(Central government) తెలిపింది. ఈ నేపథ్యంలో పాత వస్తువులపై కొత్త రేట్లతో స్టిక్కర్లను వేస్తున్నారు. పాత రేట్లతో విక్రయించేవారిపై ఫిర్యాదు చేయవచ్చు.