అక్షరటుడే, ఎల్లారెడ్డి: Gram Panchayat | ఉమ్మడి జిల్లాలో సర్పంచ్‌లు సోమవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. దీంతో 22 నెలల అనంతరం పంచాయతీల్లో (gram panchayats) గ్రామ పరిపాలన ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) 545 మంది, కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) 532 మంది సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు.
Gram Panchayat | 22 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన..
గత 22 నెలలుగా ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామపాలన కొనసాగింది. సోమవారం నుంచి సర్పంచ్‌లు (sarpanches) బాధ్యతలు స్వీకరించడంతో గ్రామాల్లో కొత్తశోభ సంతరించుకుంది. ప్రజాసేవలో నిమగ్నమై గ్రామ పంచాయతీల అభివృద్ధికి కొత్త బాటలు వేస్తామని సర్పంచులు పేర్కొన్నారు. పార్టీలు ఏవైనా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.
Gram Panchayat | కొత్త పాలకవర్గాలకు సమస్యల స్వాగతం
పంచాయతీ పాలకవర్గాలు (panchayat governing bodies) సోమవారం కొలువుదీరాయి. నూతన సర్పంచులకు ఉపసర్పంచులకు వార్డు సభ్యులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఒకవైపు గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు .. మరోవైపు వెక్కిరిస్తున్న ఖాళీ ఖజానా.. కొత్త పాలకవర్గాలకు సవాల్‌గా మారనున్నాయి. గ్రామపంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలనలో నిధులు సక్రమంగా లేకపోవడంతో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడాయి. గ్రామాల్లో డ్రెయినేజీలు, నీటి సరఫరా, డంపింగ్ యార్డుల (dumping yards) నిర్వహణ, విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ల నిర్వహణ మోటార్ల రిపేరు తడిసి మోపెడైంది.
Gram Panchayat | భవనాలు కూడా లేని పరిస్థితి..
పలుచోట్ల గ్రామపంచాయతీ భవనాలు సైతం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో పనులు చేసిన బిల్లులు సైతం రాకపోవడంతో గత పాలకవర్గం ప్రతినిధులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పంచాయతీ సిబ్బంది వేతనాలు విద్యుత్ దీపాల బిల్లులు తాగునీటి నిర్వహణకు ఆదాయం ఏమాత్రం సరిపోవటం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే చాలాచోట్ల సిబ్బందికి నెలలు తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్ల నుంచే సర్దుబాటు చేసుకునే పరిస్థితి నెలకొంది. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అభివృద్ధి బాటలో నడిపించేలా చూడాలని కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచులు కోరుతున్నారు.