Covid
Covid | భార‌త్‌లోనూ విజృంభిస్తున్న క‌రోనా.. ఇప్ప‌టి వేరియెంట్ పేరేంటి..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Covid | క‌రోనా మ‌హ‌మ్మారి(Corona virus) మ‌ళ్లీ గుబులు పుట్టిస్తుంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ కొత్త‌గా పంజా విసురుతోంది.

మొన్న‌టి వ‌ర‌కు విదేశాల‌లోనే కేసులు వ‌స్తాయ‌నుకుంటే, ఇప్పుడు భార‌త్‌లోనూ క‌రోనా కేసులు పెరుగుతుండ‌డం కాస్త ఆందోళన క‌లిగిస్తుంది. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్(Hong Kong)లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉన్నట్లు కేంద్రం చెప్పింది. వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత దేశంలో కేసులు తగ్గుముఖం పట్టి ప‌రిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఈ స‌మ‌యంలో మరోసారి దేశంలో మళ్లీ కేసులు నమోదవుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Covid | జ‌ర జాగ్ర‌త్త‌..

ప్రస్తుతం దేశంలో 257 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులు స్వల్ప తీవ్రతతో ఉన్నాయని, పరిస్థితి అదుపులో ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం మే 12 నుంచి వారం రోజుల్లో 164 కొత్త కేసులు రికార్డ్‌ అయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధిక కరోనా కేసులు వెలుగుచూశాయి. గత వారం కేరళలో 69 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం 56 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జనాభా పరంగా ఎక్కువగా ఉండే దేశాల్లో హాంకాంగ్(Hong Kong), సింగపూర్(Singpoor) కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ దేశాల్లోనే కొవిడ్ కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల క‌నిపిస్తుంది. అలానే థాయిలాండ్ (Thailand), చైనా దేశాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు సమాచారం. దీంతో కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని.. ఆరోగ్య అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నాయి.

వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్నవారు బూస్టర్ షాట్‌లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడం సహా పలు కారణాల వల్ల కరోనా కేసుల పెరుగుదల ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 70 శాతం వరకు ఎల్‌పీ.8.1 అనే కొత్త వేరియంట్ కారణంగా భావిస్తున్నారు. మరో 9 శాతం కేసులకు ఎక్స్‌ఎఫ్‌సీ వేరియంట్ కారణమని నిర్ధారించారు. ఆగ్నేయాసియాలోని అనేక ప్రాంతాల్లో ఈ కొత్త వేరియంట్ల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.