అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Wellness Hospital | నగరంలోని వెల్నెస్ హాస్పిటల్లో నెఫ్రెక్టమీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి యూరాలజీ వైద్యుడు ఎలసారి ప్రశాంత్‌రెడ్డి (urologist Dr. Elasari Prashanth Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు ఆస్పత్రిలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధారికి చెందిన 60 ఏళ్ల మద్దెల కాశయ్య పదిరోజుల క్రితం తమ ఆస్పత్రికి రాగా వైద్య పరీక్షలు (medical tests) నిర్వహించామన్నారు. కిడ్నీలో కొంతవరకు క్యాన్సర్ గడ్డ ఏర్పడిందని గుర్తించామన్నారు. దీంతో పూర్తిగా కిడ్నీని తొలగించకుండా ఎక్కడైతే క్యాన్సర్ గడ్డ ఏర్పడిందో ఆ భాగాన్ని తొలగించి ఆయన ప్రాణాలను కాపాడామని తెలిపారు.
పూర్తిగా కిడ్నీని తొలగించడం కాకుండా ఎంతవరకు అయితే గడ్డ ఉందో ఆ గడ్డ భాగాన్ని తొలగిస్తే బాగుంటుందని కాశయ్య కుటుంబ సభ్యులకు సైతం పూర్తిగా వివరించి శస్త్రచికిత్స చేశామన్నారు. ప్రస్తుతం శస్త్రచికిత్స తర్వాత సగం కిడ్నీతో కాశయ్య ఆరోగ్యంగా ఉన్నాడని ఆయన వివరించారు. చికిత్స పూర్తయిన తర్వాత మూడు రోజుల పాటు ఆస్పత్రిలో అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత ఆరోగ్యం కుదుటపడ్డాక కాశయ్యను డిశ్చార్జ్ చేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రతినిధి బోదు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. గాంధారికి చెందిన కాశయ్యకు ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తిచేశామన్నారు. తమ ఆస్పత్రిలో 24 గంటలు వైద్యచికిత్స అందజేస్తున్నామన్నారు. ఒకవేళ రాత్రి సమయంలో వచ్చినా వైద్యం అందించడానికి ముందుంటామని తెలిపారు. అతితక్కువ ఖర్చుతోనే హైదరాబాద్ వెళ్లకుండా నిజామాబాద్‌లోనే వైద్యం అందించేందుకు వెల్నెస్ ఆస్పత్రి వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. ఆపరేషన్ హెడ్ హరికృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో అతితక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయిలో వైద్యచికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో వెల్నెస్ ఆస్పత్రి మేనేజర్ సతీశ్, కాశయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.